పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది చరిత్రాత్మక బిల్లు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం కోసం యావత్ మహిళా లోకం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తోంది. మహిళల కల సాకారం చేసేందుకు మోదీ సర్కార్ చొరవ చూపడం చర్చనీయాంశమైంది. ఈ ఘనతను తమ ఖాతాల్లో వేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఉత్సాహం చూపుతున్నాయి.
ఇదిలా వుండగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలన్న మోదీ సర్కార్ నిర్ణయంపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. అయితే ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నట్టు ఆమె పేర్కొనడం గమనార్హం. కానీ కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపడం శుభపరిణామమని షర్మిల తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నట్టు షర్మిల వెల్లడించారు. ఎన్నికల సమయంలో తీసుకొస్తున్న ఈ బిల్లును రాజకీయ అవకాశం వాదం కోసం కాకుండా, నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం తీసుకురావాలని సూచించారు.
ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం బాధాకరమన్నారు. ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని షర్మిల కోరారు. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరం మద్దతిద్దామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.