మాట్లాడితే హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబు అని చెప్పుకుంటారు టీడీపీ నేతలు. ఆ తర్వాత టాలీవుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చంద్రబాబు చాలా చేశారని, ఈరోజు పరిశ్రమ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు అని గొప్పలు చెప్పుకుంటారు.
మరి అలాంటి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పరిశ్రమ నుంచి ఎంతమంది స్పందించారు. నట్టికుమార్, మురళీమోహన్ లాంటి వాళ్లు స్పందిస్తే సరిపోతుందా? ఇండస్ట్రీ నుంచి ఖండన ప్రకటన రావాలి కదా అనేది చాలామంది లాజిక్. సరిగ్గా ఇక్కడే అందరి కళ్లు తెరిపించారు సీనియర్ నిర్మాత, ఇండస్ట్రీ పెద్ద సురేష్ బాబు.
“పరిశ్రమ ఎప్పుడూ రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. చాలామంది పరిశ్రమ పెద్దలు ఇలానే ఉన్నారు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, ఇండస్ట్రీకి రాజకీయం ఆపాదించలేదు. పరిశ్రమ తరఫున ఎప్పుడూ పొలిటికల్ స్టేట్ మెంట్స్ రావు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆంధ్రా-తెలంగాణ ఇష్యూ జరిగినప్పుడు కూడా పరిశ్రమ తరఫున ఎప్పుడూ ఎలాంటి స్టేట్ మెంట్స్ రాలేదు. మేం మూవీ మేకర్స్, సినిమాలు మాత్రమే తీస్తాం. చాలామంది స్టేట్ మెంట్స్ ఇవ్వమంటారు. ఏం ఇస్తాం. రోజూ ఏదో ఒకటి జరుగుతుంటుంది. ప్రతి అంశంపై స్టేట్ మెంట్ ఇవ్వలేం కదా.”
ఇలా చంద్రబాబు అరెస్ట్ ను చాలా లైట్ తీసుకున్నారు సురేష్ బాబు. చంద్రబాబు ఇండస్ట్రీకి చాలా చేశారనే అంశాన్ని కూడా ఆయన పరోక్షంగా ఖండించారు.
“తెలుగు చిత్ర పరిశ్రమకు చాలామంది చాలా చేశారు. ఎన్టీఆర్ నుంచి చెన్నారెడ్డి వరకు చాలామంది చాలా చేశారు. నాకు తెలిసి ఇండస్ట్రీకి ఎక్కువ మంచి చేసిన వ్యక్తులు చెన్నారెడ్డి, ఎన్టీఆర్. వాళ్లు ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుతో పాటు చాలామంది ఇండస్ట్రీకి సహాయం చేశారు. ఎవ్వరూ పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు.”
చంద్రబాబు అరెస్ట్ పై ఇండస్ట్రీ నుంచి ప్రకటన ఆశించొద్దని తెగేసి చెప్పేశారు సురేష్ బాబు. గతంలో తన తండ్రి టీడీపీలో ఉన్నారని, తను కూడా పార్టీ కోసం పనిచేశానని, కాబట్టి వ్యక్తిగత స్థాయిలో తను స్పందించగలనని, పరిశ్రమ తరఫున మాత్రం తను స్పందించనని కుండబద్దలుకొట్టారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎవరైతే సింపతీ చూపిస్తున్నారో, వాళ్లకు ఆ సింపతీ ఎప్పుడూ ఉంటుందని, అంతకుమించి ఆశించొద్దని అన్నారు సురేష్ బాబు.