బీజేపీలో చేరిన ఉత్సాహమో లేక తననెవరూ ఏమీ చేయలేరనే ధైర్యమో…ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత వరకూ ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చేయని రీతిలో… తీన్మార్ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జైలు నుంచి విడుదలైన మల్లన్న జాతీయ పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. ఇవాళ తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, ఆయన తనయుడు, తనయ, అల్లుడుపై విరుచుకుపడ్డారు.
తాను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదని, 15 మీటర్ల తాడు అని అభివర్ణించారు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్, ఆయన తనయుడైన మంత్రి కేటీఆర్, కూతురు, ఎమ్మెల్సీ కవిత, అల్లుడైన మంత్రి హరీశ్ రావును కట్టేస్తా నంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతటిగా మల్లన్న నోరు ఊరుకోలేదు. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తానని శపథం చేశారు. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్ అని ఘాటుగా విమర్శించారు.
ప్రశ్నించే నాటికి తాను ఒక్కడినే ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయన్నారు. తాడు తీసుకొచ్చేందుకే తాను ఢిల్లీకి వచ్చినట్టు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం సొంత యూట్యూబ్ చానల్ వేదికగా కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తెలపై విరుచుకు పడడం చూశాం.
ఇప్పుడు జాతీయ పార్టీలో చేరి, అదే పంథాను కొనసాగించడాన్ని బీజేపీ అనుమతిస్తుందా? తదితర ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇదే విధానం కొనసాగితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో తిట్ల పురాణానికి తెరలేపినట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తీన్మార్ మల్లన్న దూషణలపై అధికార టీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.