ఒకప్పుడు హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు ఎంతో ప్రియమైనవాడు. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. మంత్రిని చేసి సముచిత స్థానం ఇచ్చాడు. అలాంటి ఈటలను భూకబ్జాదారుగా చిత్రీకరించాడు.
తన సొంత మీడియాలో ఈటలకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు రాయించాడు. ప్రసారం చేయించాడు. మంత్రులతో తిట్టించాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేవలం ఈటలను ఓడించడం కోసం దళితబంధు పథకాన్ని అప్పటికప్పుడు సృష్టించాడు కేసీఆర్. దానికి కానీ వినీ ఎరుగని ప్రచారం కల్పించాడు. కేవలం ఈటలను ఓడించడం కోసం వందలకోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసాడు.
దేశం మొత్తం హుజూరాబాద్ వైపు చూసేలా చేశాడు కేసీఆర్. ఈటల పుణ్యమా అని హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన అనేక మంది నాయకులకు పదవులు వచ్చాయి. కానీ అనుకున్నది ఒకటి …అయ్యింది ఒకటి అన్నట్లుగా హుజూరాబాదులో కేసీఆర్ పరువు పోయింది.
అక్కడి ప్రజలు ఈటల రాజేందర్ తప్పుచేయలేదని నమ్మారు. అందుకే గెలిపించారు. వారు కేసీఆర్ మాటలు నమ్మలేదు. తాజాగా ఈటల భూకబ్జా వాస్తవమేనని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు మెదక్ జిల్లా కలెక్టర్. ఈటల 70 ఎకరాలు కబ్జా చేశాడని చెప్పాడు. దీంతో ఈటల భార్య జమున రంగంలోకి దిగింది. తాము ఏ తప్పు చేయలేదని చెప్పింది.
జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ కండువా వేసుకొని మాట్లాడుతున్నారంది. కలెక్టర్ మీద కేసు పెడతామని చెప్పింది. భూముల సర్వే వివరాలను కోర్టుకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన దళితుడైన రాజయ్యను యేవో ఆరోపణల మీదనే మంత్రివర్గం నుంచి తొలగించాడు. ఆ ఆరోపణలు ఏమిటో కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదు.
రాజయ్య కూడా కేసీఆర్ మీద తిరగబడటమో, రచ్చ చేయడమో చేయలేదు. దీంతో ఆ అధ్యాయం ముగిసిపోయింది. ఆ తరువాతి ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ ఇచ్చాడు కేసీఆర్. రాజయ్య కూడా గెలిచాడు. కానీ ఈటల రాజేందర్ రాజయ్యకు విరుద్ధంగా కేసీఆర్ మీద తిరగబడ్డాడు. సవాల్ చేశాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచాడు.
ఈటల మీద చేసినంత వ్యతిరేక ప్రచారం ఆనాడు రాజయ్య మీద చేయలేదు. ఈటల మీద కేసీఆర్ పగ తీర్చుకోవాలంటే కోర్టులో ఈటల మీద భూకబ్జా ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలి. దోషిగా నిలబెట్టాలి. తాను ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించడం ఎందుకు సరైనదో ప్రజలకు తెలియచేయాలి.
కేసీఆర్ అలా చేయగలడా? ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అడ్డంగా దొరికిన ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేకపోయారు. ఈటల భూకబ్జా కేసు ఏం చేస్తారో చూడాలి.