పూర్వం ప్రేమపెళ్లిళ్లే అరుదుగా ఉండేవి. ఫలానా వాళ్లమ్మాయి ఎవరినో లవ్ మేరేజ్ చేసుకుందిట అనే వార్త విడ్డూరంగా చెప్పుకునే సమాజాలుండేవి. కులాంతరవివాహాలకి కూడా సమాజం సానుకూలంగా స్పందించేది కాదు. అటువంటి కథలతో సినిమాలొస్తే సమాజాన్ని సినిమాలు చెడగొడుతున్నాయని ఒక వర్గం, కాదు సంఘసంస్కరణలో భాగమని కొందరు అనుకునేవాళ్లు.
కాలం మారింది. ఇప్పుడు కులాంతర వివాహాలు, ప్రేమపెళ్లిళ్లు పెద్ద విషయమే కాదు. ఇంకా పలుచోట్ల పరువుహత్యలు జరుగుతున్నా సమాజంలో ఎక్కువశాతం మంది మాత్రం దానికి ఒకప్పటిలాగ తప్పుగా భావించడంలేదు.
అయితే ఆమధ్య బయలుదేరి ఈమధ్య కొత్తగా పరుగెడుతున్న ప్రక్రియ సహజీవనం. దీనికి సమాజంలో ఇంకా పూర్తిస్థాయి ఆమోదం లేదు. పెళ్లవ్వకుండా అమ్మాయి,అబ్బాయి కలిసుండడమనేది తప్పుగా భావించే సమాజమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. కానీ ఈ వ్యవహారం సెలెబ్రిటీస్ లో బాగా ముదురుతోంది.
సినిమాల్లో ఎలా ఉన్నా నిజజీవితంలో కూడా నటీనటులు, ఆటగాళ్లు సహజీవనాల్లో మునిగి తేలి దానిని అఫీషియల్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. సునీల్ సెట్టి లాంటి నటుడైతే ఏకంగా కూతురిచేత సహజీవనకాపురం పెట్టించాడు. ఏమన్నా అంటే వాళ్లది మెచ్యూర్డ్ సొసైటీ అని, బంధానికి తాళి అవసరం లేదని, మనసులు కలిస్తే చాలని ఏవో సూక్తులు చెబుతారు.
వారిని చూసి ఎందరో సమాన్య యువతీయువకులు కూడా ప్రభావితం చెందుతున్నారు. కానీ అందులో పొంచి ఉన్న ప్రమాదాలను లెక్కవేసుకోవడం లేదు. ఎవరో ఒక యువకుడు కాస్త నచ్చే సరికి నమ్మి ట్రాపులో పడిపోయి సహజీవనానికి సై అనేస్తున్నారు అమ్మాయిలు. పైగా వేరే ఊళ్లల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే రోజులవడం చేత అమ్మానాన్నలకు తెలియకుండా కోరుకున్నప్రియుడుతో కాపురం పెట్టేసే అమ్మాయిలు ఎక్కువౌతున్నారు.
అప్పుడెప్పుడో వచ్చిన “డియర్ జిందగీ”లో ఒక సీనుంటుంది. కుర్చీ కొనాలనుకున్నప్పుడు అన్ని కుర్చీల్లోనూ కూర్చుని ఫైనల్ గా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టే, అందరితోటి గడిపి నచ్చిన వారితో జీవితం పంచుకోమని చెప్పడం ఆ సీన్ ఉద్దేశ్యం. అంతకంటే దరిద్రమైన సలహా ఉండదు. ప్రాణమున్న మనిషితో జీవితానికి, ప్రాణంలేని కుర్చీలాంటి వస్తువుతో పోలికపెట్టడమే తప్పు.
ఇక్కడ సహజీవనమా, పెళ్లా అనేది కాదు. స్వయంవరంలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడుకోవాలి.
రకరకాల సైకలాజికల్ సమస్యలతో బతుకుతూ సెక్స్ ఒక్కటే పరమావధిగా జీవించే సైకోలు కొందరుంటారు. వాళ్లు మామూలు మనుషుల్లాగే ఉంటారు. కానీ మోజు తీరాక వాళ్లల్లో సైకో బయటికొస్తాడు. అప్పటివరకు ఉన్న బంధం వద్దనుకుంటారు. కాదంటే నిర్దాక్షణ్యంగా చంపేసి ముక్కలు కోసి ఫ్రిజ్జులో పెట్టేస్తున్నారు. మిస్సింగ్ కేసు కింద నమోదైన అమ్మాయి చావు గురించి తెలియడానికి తల్లిదండ్రులు నానాచావూ చావాల్సొస్తోంది. చివరకి సైకో దొరికినా ప్రయోజనమేంటి?
అలా కాకుండా పెళ్లయ్యుంటే వెనుక చట్టమనేది ఒకటుంటుంది. అటు ఇటు పెద్దవాళ్లుంటారు తేడా వస్తే సంప్రదింపులకి. కొంతలో కొంత గృహహింస చట్టం బలంగా పనిచేస్తుంది.
ఒకమ్మాయికి ఒకబ్బాయి నచ్చితే గుడ్డిగా వలలో పడిపోవడం అస్సలు శ్రేయస్కరం కాదు. అందునా పొరుగూళ్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిలు సైకోలకి పెద్ద టార్గెట్టవుతున్నారు. ఏ అబ్బాయి నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా ఒకటికి వందసార్లు ఆలోచించాలి. తప్పు జరిగితే ఫూలవ్వడమే కాకుండా, ప్రమాదంలో చిక్కుకోవడమే కాకుండా తల్లిదండ్రులకి కూడా జీవితాంతం కన్నీళ్లు మిగిల్చినవాళ్లవుతారు.
– విన్నకోట లక్ష్మీగాయత్రి