సినిమాలను హీరోలు ఓకె చేయడంలో మేనేజర్ల పాత్ర మరీ ఎక్కువా వుండదు..మరీ తక్కువా వుండదు. ఓ మాట సాయం అయితే వుంటుంది. కథలు వినడం, ఏ నిర్మాతకు చేయడం అన్నది హీరోలే ఎక్కువగా డిసైడ్ చేస్తారు. చేసుకుంటూ వుంటాయి. అయినా కూడా హీరో ల మేనేజర్ల పాత్ర కొంతయినా వుంటుంది. ఆక్కడే మేనేజర్లు సంతోష పడడానికైనా, మాట పడడానికైనా చాన్స్.
నిజానికి హీరోలు తెలివైన వారు. మేనేజర్లను ఎంత వాడుకోవాలో అంతా వాడుకుంటారు..ఎక్కడ బ్రేక్ వేసుకోవాలో అక్కడ వేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్పడం ఇప్పుడు అంటే టాలీవుడ్ లో ఓ మేనేజర్ మీద కాస్త విమర్శలు వినిపిస్తున్నాయి.
తనకు నచ్చిన నిర్మాతలు, బ్యానర్లకు ఓ తరహా సినిమాలు, నచ్చని వారికి మరో తరహా సినిమాలు వెళ్లేలా చేస్తున్నారన్నది విమర్శ. వివరంగా చెప్పాలంటే మిడ్ రేంజ్ లేదా, ఓ రేంజ్ హీరోలకు కొంత మార్కెట్ అనేది వుంటుంది. దాని పరిథి లోపల సినిమా తీస్తే నిర్మాత సేఫ్ లో వుంటారు. దాటేసే ప్రాజెక్టులు ఎంత గొప్పవి అయినా నిర్మాతకు కష్టమే.
ఓ స్థాయి హీరో సినిమాల్లో ఇలాంటి రెండు రకాలు వున్నాయి. మంచి పేరు వచ్చింది. అంతా శహభాష్ అన్నారు. నిర్మాతను, హీరోను గాల్లోకి ఎత్తారు. కానీ పాపం నిర్మాతకు పెద్దగా ఏమీ మిగల్లేదు. ఇప్పుడు అలాగే మరో సినిమా చేస్తున్నాడు. మంచి పేరు వచ్చేలాగే వుంది. కానీ నిర్మాతకు మిగిలే అవకాశం కనిపించడం లేదు. మరో రెండు ప్రాజెక్టులు ఓకె చేసాడు. అవి మాత్రం రీజనబుల్ బడ్జెట్ లో అయ్యేలా వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో కొందరు నిర్మాతలు వెళ్లి హీరో మేనేజర్ ను కాస్సేపు ఆడుకున్నట్లు తెలుస్తోంది. ఖర్చయ్యే ప్రాజెక్టులు ఒకరికి, డబ్బులు మిగిలే ప్రాజెక్టులు వేరేకరికి సెట్ చేస్తున్నావని సరదాగా అయినా కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు బోగట్టా. అయినా మేనేజర్ కూడా ఇలాంటి మాట పడకుండా చూసుకొవాల్సి వుంది. హీరోకి నచ్చచెప్పి అయినా. కేవలం హీరో పేరు కోసం చూసుకుంటే నిర్మాతలకు కష్టం కదా?