అవతల పవన్ కల్యాణ్ అధికార పార్టీలోని నూటా యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలనూ లెక్క చేసేది లేదని ప్రకటించుకుంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్లు కూడా ఈయనను లెక్క చేయడం లేదనుకోండి. వాళ్లు లెక్క చేయకపోవడం సంగతలా ఉంటే.. పవన్ కల్యాణ్ ను ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే లెక్క చేయడం లేదు. ఇదే ఆసక్తిదాయకంగా, చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించే సభకు తను హాజరు కాబోవడం లేదని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తేల్చి చెప్పారు. తనకు అసెంబ్లీ ఉందని, అలాంటప్పుడు పార్టీ మీటింగ్ కు హాజరయ్యేది ఏముందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు.
అలాగే ఇంగ్లిష్ మీడియం చదువుల విషయంలో పవన్ కల్యాణ్ స్టాండుతో జనసేన ఏకైక ఎమ్మెల్యే పూర్తిగా విబేధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టినా.. .తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉంటుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దళితుల పిల్లల్లో తక్కువ మందే ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లి ఇంగ్లిష్ మీడియం చదివే వారు ఉంటారని, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే వారిలో దళితుల పిల్లలే ఎక్కువని, వారు ఇంగ్లిష్ మీడియంలో చదివి, ప్రైవేట్ స్కూల్స్ పిల్లలతో పోటీ పడటం మంచే చేస్తుందని జనసేన ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.పవన్ కల్యాణ్ ఆందోళన చెందుతూ ఉన్న విషయం వాస్తవమే అని అంటూనే.. ఇంగ్లిష్ మీడియం బోధనను జనసేన ఏకైక ఎమ్మెల్యే గట్టిగా సమర్థిస్తూ ఉన్నారు.
ఇలా జనసేన తరఫున రాష్ట్రమంతా కలిసి నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే ఆ పార్టీ అభిమానులకు కూడా పంటి కింద రాయిలా మారుతున్నారు. దీనికి బదులు ఆయన కూడా ఓడిపోయి ఉంటే, అప్పుడు పవన్ కు మరింత సౌలభ్యంగా ఉండేదని.. 'అసెంబ్లీ ఎంత.. దాని బతుకెంత..' అంటూ మాట్లాడేందుకు తమ పార్టీ అధినేతకు అవకాశం ఉండేదని జనసేన వీరాభిమానులు వాపోతున్నారు.