ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కార్ తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు మార్గం సుగుమమైంది.
మోదీ కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ స్వాగతించారు. ఈ బిల్లును తామే రూపొందించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లును ప్రత్యేక సమావేశాల్లోనే పాస్ చేయాలని ఆమె డిమాండ్ చేయడం విశేషం.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మహిళా ఎంపీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే సమయం వచ్చినందుకు సంతోషంగా వుందన్నారు. మోదీ సర్కార్ తన బలాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఉపయోగించడం శుభపరిణామమన్నారు.
ఈ బిల్లు ఆమోదం కోసం మహిళలంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు సిద్ధం కావడానికి తమలాంటి పార్టీల ఒత్తిడే కారణమన్నారు. గతంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తమ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా బిల్లు ఆమోదం కోసం ధర్నా చేపట్టడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేయడం విశేషం.