ఏపీ రాజధాని విషయమై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజీ కలిగించేలా బుగ్గన రాజధానిపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చారు. తమ మంత్రి చేయాల్సిన నష్టమంతా చేస్తే, సజ్జల మాత్రం మరెవరిపైన్నో ఆడిపోసుకోవడం ఎవరికీ అర్థం కాదు. బెంగళూరులో మంత్రి బుగ్గన ఏమన్నారో తెలుసుకుందాం.
“విశాఖను రాజధానిగా మా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి మూడు రాజధానులు అన్నది అవాస్తవం. విశాఖ ఒక్కటే రాజధాని. కర్నాటకలో మాదిరిగా ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాల్ని గుంటూరులో నిర్వహిస్తాం. కర్నాటకలోని ధార్వాడ్‌లో ఒక హైకోర్టు బెంచి, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయి. ఆ ప్రకారమే కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం”
తమ ప్రభుత్వం మనసులో ఏమున్నదో బుగ్గన కుండబద్దలు కొట్టారు. రాజధానిపై తాను కీలక వ్యాఖ్యలు చేస్తున్నానని స్పృహ లేకుండా బుగ్గన మాట్లాడి వుండరు. బుగ్గన చిన్నపిల్లోడు కాదు. ఆయన చాలా తెలివైన నాయకుడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సజ్జల మీడియా ముందుకొచ్చి…. బుగ్గన మాటల్ని కనీసం ఆయన ఖండించలేదు. పైగా ఆయన అన్న మాటల్లో తప్పు లేదని చెప్పుకొచ్చారు. సజ్జల ఏమన్నారో చూద్దాం.
“రియల్ ఎస్టేట్ కోసం కొందరు వాదనలు చేస్తున్నారు. ఎవరూ అపోహలకు గురి కావాల్సిన పనిలేదు. కొందరు కావాలనే అయోమయం సృష్టిస్తున్నారు. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదు. మూడు రాజధానుల ఏర్పాటుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అసెంబ్లీ అమరావతిలో, హైకోర్టు కర్నూలులో, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటాయి. వీటిని మేము మూడు కేపిటల్స్ అనే పిలుస్తాం. మంత్రి బుగ్గన కూడా ఇదే విషయం చెప్పారు. కొందరు కావాలనే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారు. విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయమా? పూర్తిగా వెళ్లడమా? అనేది సుప్రీంకోర్టు తీర్పును బట్టే ఉంటుంది”
రాజధానిపై ఏపీ ప్రజానీకంతో ఆట్లాడుకోవాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. అందరినీ అయోమయానికి గురి చేసిన మంత్రి బుగ్గన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రాలేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. తన వ్యాఖ్యలను ఎలా వక్రీకరించారో బుగ్గన చెప్పి వుంటే సబబుగా వుండేది. అలా కాకుండా ప్రతిదానికి తానున్నానంటూ సజ్జల మీడియా ముందుకొచ్చి, పొంతన లేకుండా మాట్లాడ్డం ఏంటో మరి!