టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ రోజురోజుకు మరీ లోకువ అవుతున్నారు. కుప్పంలో మొదలైన ఆయన పాదయాత్ర ఇవాళ్టికి 20 రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో స్థానిక ప్రజాసమస్యలపై ప్రస్తావించడం ద్వారా అక్కడి జనం మనసులను చూరగొనే అవకాశం వుండేది. కానీ మంచి అవకాశాన్ని లోకేశ్ చేజేతులా జారవిడుచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి రోజా అంటే టీడీపీ నేతలెవరికీ గిట్టదు. ఆమె అంటే వారికి గౌరవం కూడా లేదు. కానీ పాదయాత్రలో ప్రతి మీటింగ్‌లో రోజా జపం లోకేశ్ ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలి.
కుప్పంలో పాదయాత్ర ప్రారంభ సభలో సీఎం జగన్ తర్వాత లోకేశ్ ప్రధాన టార్గెట్ రోజానే. ఆ తర్వాత ప్రతి మీటింగ్‌లోనూ జగన్ కంటే రోజాపైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ధ్వజమెత్తారంటే అర్థం చేసుకోవచ్చు. సత్యవేడుకు వెళ్లినా ఆమె గురించే ఆలోచనలా? ఇదెక్కడి విడ్డూరం. లోకేశ్ చర్యలతో రోజా ఇమేజ్ మరింత పెరగడం తప్పితే, ఆమెకు వచ్చే నష్టం ఏమీ లేదు.
పాదయాత్రలో భాగంగా బుధవారం సత్యవేడు నియోజకవర్గంలోని వెంకటరెడ్డికండ్రిగలో మహిళలతో లోకేశ్ ముచ్చటించారు. రోజా తనకు చీర-గాజులు పంపుతానన్న విషయాన్ని మళ్లీ ఆయన గుర్తు చేశారు. రోజాకు తెలుగు మహిళలు సారె పెట్టేందుకు వెళ్తే వారిని అరెస్ట్ చేయించిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పళ్లు రాలగొడతానని రోజా అనడంపైనా ఆయన స్పందించారు. చంద్రబాబును నడివీధిలో కొట్టాలి, కాల్చాలంటూ జగన్‌రెడ్డి హెచ్చరించినప్పుడు జగన్ పళ్లు రాలగొట్టాల్సిందని ఆయన ఉచిత సలహా ఇచ్చారు.
అలాగే తన తల్లిని అసెంబ్లీలో అవమానించినప్పుడు రోజా ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ తరపున కూడా రోజానే ప్రశ్నించాలనే రీతిలో లోకేశ్ మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి జగన్ భార్య భారతి, ఆయన తల్లి, చెల్లిపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలితే తానేం చేశాడో లోకేశ్ చెప్పి వుంటే బాగుండేది. లోకేశ్ ప్రసంగంలో పదేపదే రోజా ప్రస్తావన తేవడాన్ని చూస్తే… ఆమె విమర్శలకు యువ నాయకుడు బాగా ఇబ్బంది పడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు.