బాహుబలి-2 కు అతి దగ్గరగా వచ్చిన పఠాన్

పఠాన్ మూవీ కేవలం కాంట్రవర్సీ హిట్ మాత్రమే కాదు, రియల్ హిట్ అని కూడా అనిపించుకుంటోంది. ఎవరు ఔనన్నా కాదన్నా పఠాన్ కి వస్తున్న కలెక్షన్లు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి. మూడోవారం సినిమా కాస్త డల్…

పఠాన్ మూవీ కేవలం కాంట్రవర్సీ హిట్ మాత్రమే కాదు, రియల్ హిట్ అని కూడా అనిపించుకుంటోంది. ఎవరు ఔనన్నా కాదన్నా పఠాన్ కి వస్తున్న కలెక్షన్లు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి. మూడోవారం సినిమా కాస్త డల్ అవుతుంది అనుకునే సమయానికి వాలంటైన్స్ డే వచ్చేసింది. ఇంకేముంది, ప్రేమజంటలన్నీ పార్కుల కంటే, పఠాన్ సినిమా థియేటర్లు బెటరంటూ క్యూ కట్టాయి.

ప్రేమజంటల పుణ్యమా అని.. పఠాన్ వాలంటైన్స్ డే రోజున రూ.5.65కోట్లు సాధించాడు. మూడోవారంలో ఓ భారతీయ సినిమా సింగిల్ డే హయ్యస్ట్ కలెక్షన్ ఇదే. ఈ వారం ఇలా కంటిన్యూ అయితే.. థర్డ్ వీక్ లో ఇప్పటి వరకూ బాహుబలి-2 సెట్ చేసిన 50కోట్ల రికార్డ్ కలెక్షన్లను కూడా పఠాన్ దాటేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్ లో అమీర్ ఖాన్ దంగల్ కూడా పఠాన్ కు పోటీగా ఉంది.

ఎంత పెద్ద హిట్ సినిమా అయినా మూడోవారంలో కలెక్షన్లు వీక్ అవుతాయి. కానీ దంగల్, బాహుబలి-2 విషయంలో కలెక్షన్లు నిలకడగా కొనసాగాయి. అందుకే థర్డ్ వీక్ లో ఆ రెండు సినిమాల కలెక్షన్లు రికార్డులు సృష్టించాయి. వాటిని ఇప్పుడు పఠాన్ సరిచేసే దిశగా దూసుకుపోతున్నాడు.

మరోవైపు హిందీ సినిమాల్లో అత్యథిక కలెక్షన్ల రికార్డ్ క్రియేట్ చేయబోతోంది పఠాన్. బాహుబలి-2 హిందీ వెర్షన్ ఓవరాల్ కలెక్షన్ల రికార్డ్ రూ.510.99 కోట్లకు దగ్గరైంది షారూక్ సినిమా. ఇప్పటికే పఠాన్ కి 493.25కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

అయితే ఈ వారం పఠాన్ సినిమాకి పోటీగా షెహజాదా, యాంట్ మ్యాన్ సినిమాలు రిలీజవుతున్నాయి. షెహజాదాకు పెద్దగా క్రేజ్ లేదనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ తో తేలిపోయింది. యాంట్ మ్యాన్ ప్రభావం లేకపోతే మాత్రం పఠాన్ కు తిరుగుండదు.

ఓవర్సీస్ లోనూ దుమ్ము దులిపాడు..

పఠాన్ సినిమా కేవలం భారత్ లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటి వరకు ఓవర్సీస్ నుంచి 360 కోట్ల రూపాయలు పఠాన్ వసూలు చేసింది.

గతంలో పఠాన్ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి, కేవలం బేషరమ్ రంగ్ పాట వివాదమే ఆ సినిమాని కాపాడింది అనుకున్నారంతా. కానీ రోజు రోజుకీ పఠాన్ కలెక్షన్ల సునామీ చూస్తుంటే షారుఖ్ ఖాన్ మార్కెట్ ఇంకా తగ్గలేదని రుజువైంది. పఠాన్ ప్రమోషన్ మొత్తాన్ని షారుఖ్ ఖాన్ తన భుజాలపై మోశారు, తన సినిమాగా దాన్ని ఓన్ చేసుకుని మార్కెటింగ్ చేశారు. చివరకు బాలీవుడ్ బాద్ షా గా తన పేరు నిలబెట్టుకున్నాడు.