విశాఖ రాజధాని అంటే అంత నొప్పెందుకబ్బా…?

విశాఖ రాజధాని అని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తరచూ ఏదో చోట మంత్రులు కీలక నేతలు దీని మీద మాట్లాడుతూంటారు. అది వైసీపీ ప్రభుత్వ విధానం. మూడు రాజధానులుగా తాము ప్రకటించామని అందులో…

విశాఖ రాజధాని అని వైసీపీ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తరచూ ఏదో చోట మంత్రులు కీలక నేతలు దీని మీద మాట్లాడుతూంటారు. అది వైసీపీ ప్రభుత్వ విధానం. మూడు రాజధానులుగా తాము ప్రకటించామని అందులో పాలనా రాజధానిగా విశాఖ ఉంటుందని ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.

ఇక మీడియా ముఖంగా వచ్చే ప్రశ్నలకు సమాధానంగానో లేక పార్టీ సమావేశాల్లోనో లేక అధికారిక సమావేశాల్లోనో ఈ విషయం దొర్లినపుడు వైసీపీ మంత్రులు ఒక క్లారిటీ ఇస్తూంటారు. ఎందుకంటే అది వారు అనుకుంటున్న విధానం. రాజధానిని ఏపీలోని విశాఖలోనే పెడతామని అంటున్నారు తప్ప మరేమీ కాదు కదా అన్నదే వైసీపీ నేతల వాదన.

అయితే ఇలా ఒక ప్రకటన వైసీపీ మంత్రుల నుంచి వస్తుందో లేదో వెంటనే ఉత్తరాంధ్రాకు చెందిన టీడీపీ నేతలు అలెర్ట్ అయిపోతారు. వైసీపీ మీద మాటలతో విరుచుకుపడిపోతారు. ఇక్కడ వారు ఎక్కడా విశాఖ రాజధానికి తాము వ్యతిరేకమని చెప్పరు. కానీ ఇండైరెక్ట్ గా అదే అర్ధం వచ్చేలా మాట్లాడుతూంటారు. 

రాజధానిగా విశాఖ అనర్హమనా లేక తమ నాయకుడు చంద్రబాబు ప్రవచించిన ఇంద్ర లోకం అమరావతి మాత్రమే వైభోగంతో ఉంటే చాలు అనుకుంటున్నారా తెలియదు కానీ విశాఖ రాజధాని అనగానే మాత్రం తమ్ముళ్ళు చెల్లెళ్ళు మండిపోతూంటారు.

రాజకీయాలు పార్టీలు పక్కన పెడితే అసలు విశాఖ ఏమి పాపం చేసింది తమ్ముళ్ళూ అంటే ఏమి సమాధానం ఇస్తారో తెలియదు. విశాఖ రెడీ మేడ్ రాజధాని, అమరావతి ఊహల్లో ఉన్న నగరం. అది కూడా తెలుగుదేశం పెద్దలకు మాత్రమే నవ నగరాలుగా ప్రపంచ రాజధానిగా కనిపిస్తూ ఉంటుంది.

దేవతా వస్త్రాలు లాంటి అమరావతి రాజధానిని అంతా ఊహించుకుని ఆహా ఓహో అనాలన్నదే తమ్ముళ్ల వాదనగా ఉంది కాబోలు. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి బెంగుళూరు రోడ్ షోలో మాట్లాడుతూ విశాఖ పాలనా రాజధానిగా ఉంటుందని, కీలక నగరంగా ఉంటుందని ఇన్వెస్టర్లకు తెలిపారు. ఆయన అలా అనగానే విశాఖ ఒక్కటే రాజధాని అని టీడీపీ అనుకూల మీడియా సహా తమ్ముళ్ళు విమర్శలు మొదలెట్టేశారు.

మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉన్నామని సజ్జల రామక్రిష్ణారెడ్డి దీని మీద మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. అచ్చేన్నాయుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లాంటి వారు అయితే మూడు రాజధానుల మీద విశాఖ రాజధాని మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇక్కడ వైసీపీ వారి నుంచి కానీ విశాఖ జనం నుంచి వస్తున్న ఒక్కటే సూటి ప్రశ్న. విశాఖ పాలనా రాజధానిగా ఉండవద్దా. అసలు విశాఖకు ఆ అర్హత లేదా. విశాఖ రాజధాని అని అంటే అంత ఉలుకెందుకు అన్న దానికి తెలుగు తమ్ముళ్ళు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తొందరలో విశాఖ రాబోతున్న చంద్రబాబు దీని మీద ఏదైనా క్లారిటీ ఇస్తారా అని అడుగుతున్నారు.