జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి తానేటి వనిత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ కొత్త వివాదాలలో చిక్కుకోవడం తరచుగా జరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు జరిగే సందర్భాలలో వాటి గురించి వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చి తలా తోకాలేని మాటలతో, డొంక తిరుగుడు కారణాల విశ్లేషణలతో ఆమె తన ఇమేజ్‌కు తానే గండి కొడుతున్నారు.
తాజాగా తాడేపల్లి లో బాలిక హత్య అనేది గంజాయి కారణంగా జరగలేదని పోలీసుల పనితీరును సమర్ధించడానికి మీడియా ముందుకు వచ్చిన ఆమె తన మాటల ద్వారా పోలీసులను మరింత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టేశారు.
నాయకులు ఏదైనా వివాదం రేగినప్పుడు తాము స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణలు ఇవ్వాల్సి వస్తే గనుక దానికి సంబంధించి పూర్తి వివరాలతో సిద్ధమైరావాలి. అసలే ప్రతికూల రాజకీయాలకు తగినట్లుగా ప్రతికూల మీడియా ప్రతినిధులు కూడా పెచ్చరిల్లుతున్న ఈ రోజులలో బాధ్యత గల పదవుల్లో ఉన్న మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. అయితే అలాంటి ప్రిపరేషన్ లేకుండా ప్రెస్ మీట్లకు వచ్చే తానేటి వనిత తరచూ తన మాటలు సృష్టించే వివాదాలలో చిక్కుకుంటున్నారు.
తాడేపల్లి బాలిక హత్య అనేది గంజాయి, మద్యం మత్తులో జరిగినది కాదని.. వ్యక్తిగత కారణాలే హత్యకు దారి తీశాయని ఆమె చెప్పదలచుకున్నారు. అయితే ఆ వ్యక్తిగత గొడవలు ఏమై ఉంటాయో ఆమె ప్రిపేర్ కాలేదు. మీడియా వాళ్ళు అడగగానే తడబడ్డారు. గంజాయి మద్యం మత్తులో ఉన్నారని అనడం కరెక్ట్ కాదని వెనకేసుకొచ్చారు. సాక్షాత్తు హోం మంత్రి కేవలం పోలీసులను కాదు కదా, నిందితుడిని కూడా సమర్ధిస్తున్నట్లుగా ఆమె వివరణలు ఉన్నాయి. నిందితుడి మీద తేలిక సెక్షన్లతో కేసులు నమోదు అయ్యే వీలుకల్పించేలా ఆమె వివరణ ఉందనే ఆరోపణలూ వస్తున్నాయి.
‘గంజాయి నియంత్రణలో పోలీసులు విఫలం చెందలేదు’ అని చాటడంలో భాగంగా ఆమె నిందితుడికి కూడా అనుకూలంగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఇదంతా ఆమె ఉద్దేశపూర్వకంగా చేశారని అనడానికి వీల్లేదు. అవగాహన లేకుండా మాట్లాడి ఇలాంటి గందరగోళం సృష్టిస్తున్నారు.
సీతానగరం అత్యాచారం కేసులో నిందితుడిని ఇప్పటిదాకా పట్టుకోలేకపోవడంపై మంత్రి వివరణ కూడా హాస్యాస్పదంగా ఉంది. నిందితుడు తరచుగా సిమ్ లు మారుస్తూ వేరు వేరు ప్రాంతాలలో తిరుగుతున్నాడని, అందువల్ల పట్టుకోలేకపోతున్నామని హోం మంత్రి చెప్పడం చిత్రం. వందల సిమ్ లు వాడే కరడుగట్టిన నేరగాళ్లనే పట్టుకునే పోలీసుల సామర్థ్యాన్ని సాక్షాత్తు హోం మంత్రి అవమానించినట్లుగా ఈ ప్రకటన ఉంది.
గతంలో కూడా హత్యలు, అత్యాచారాలు జరిగిన వేరువేరు సందర్భాలలో హోం మంత్రి ప్రకటనలు వివరణ కంటే వివాదానికే దారితీసాయి! ముందు ముందు ప్రభుత్వం పరువు నిలబడాలంటే హోం మంత్రి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని ప్రజలు భావిస్తున్నారు.