కెవ్వు కేక: పవన్ కల్యాణ్ అలా.. అతడి ఎమ్మెల్యే ఇలా!

తెలుగు భాష చచ్చిపోతుందంటూ పవన్ కల్యాణ్ గగ్గోలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మాతృభాషను జగన్ చంపేస్తున్నారంటూ కొన్ని రోజుల కిందట జనసేనాని మామూలుగా రచ్చ చేయలేదు. ట్విట్టర్ పేజీలో రకరకాల పోస్టులు పెట్టారు.…

తెలుగు భాష చచ్చిపోతుందంటూ పవన్ కల్యాణ్ గగ్గోలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మాతృభాషను జగన్ చంపేస్తున్నారంటూ కొన్ని రోజుల కిందట జనసేనాని మామూలుగా రచ్చ చేయలేదు. ట్విట్టర్ పేజీలో రకరకాల పోస్టులు పెట్టారు. మైక్ అందుకొని రకరకాల ఉపన్యాసాలు దంచారు. వాటిని ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు జనసేనాని మాటల్ని అతడి ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు.

అవును.. జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానాన్ని స్వాగతిస్తున్నట్టు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకున్నారు.

“ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, గతంలో చంద్రబాబు కూడా ఓ ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అడ్డుపెట్టాలి. అడ్డుకోవాల్సిన అవసరం లేదు.”

పవన్ కు వ్యతిరేకంగా రాపాక స్పందించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో బడ్జెట్ సమావేశాల టైమ్ లో కూడా ఇలానే జరిగింది. బడ్జెట్ పై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తే, అద్భుతంగా ఉందని రాపాక మెచ్చుకున్నారు. అప్పట్లో జగన్ ను రాపాక మెచ్చుకున్న తీరు హాట్ టాపిక్ గా కూడా మారింది.

ఆ తర్వాత తన నియోజకవర్గంలో ఆటోడ్రైవర్లతో కలిసి జగన్ చిత్రపటానికి రాపాక పాలాభిషేకం కూడా చేశారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ వేదికగా జగన్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో పవన్-రాపాక మధ్య అభిప్రాయబేధాలున్నాయనే విషయం మరోసారి బయటపడింది.

పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే తనను పట్టించుకోకుండా పవన్ ఇష్టారాజ్యంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారని ఇదివరకే ఓసారి తన సన్నిహితుల వద్ద వాపోయారు రాపాక. తనకు అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంపై కూడా పవన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో మాట్లాడారు రాపాక.