సాక్షి పత్రిక, చానల్‌పై భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.సాక్షి నిజాలను మాత్రం ఆవిష్కరిస్తుందని నమ్ముతూ ఉంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు.సాక్షి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే…ఎల్లో మీడియా బొమ్మ అయితే,సాక్షి మీడియా బొరుసు. అంతే తేడా.ఇంకా చెప్పాలంటే ఎల్లో మీడయా మన్ను అనుకుంటే, సాక్షి మీడియా దుమ్ము. వైఎస్ కుటుంబ రాజకీయాల అవసరాల నేపథ్యం నుంచి సాక్షి ఆవిర్భవించింది.వైఎస్ జగన్ కుటుంబ ప్రయోజనాలు పోనూ,ఇంకా ఏదైనా స్పేస్ మిగిలితే ప్రజాప్రయోజనాలకు కేటాయిస్తారు.
సాక్షి…జగన్ ఒప్పంటే ఒప్పు.జగన్ తప్పంటే తప్పు.అంతే తప్ప నిజానిజాలతో సాక్షి పత్రికకి, చానల్‌కి ఏ మాత్రం సంబంధం లేదు.”ఉన్నది ఉన్నట్టు…ఉండదు కనికట్టు” నినాదంతో సాక్షి 2007లో ప్రారంభమైంది.అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రెండు పత్రికలంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు. అందులోనూ ఆ రెండు పత్రికలు వైఎస్సార్‌పై కక్ష కట్టినట్టు వ్యక్తిగత డ్యామేజీ చేసేందుకు వార్తా కథనాలను వండి వార్చేవి.ఈ నేపథ్యంలో ఆవిర్భవించిన సాక్షి దినపత్రికను పాఠకులు ఆదరించారు.
అయితే ఎల్లోమీడియాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాక్షి ప్రవర్తిస్తూ వచ్చింది.నాడు కాంగ్రెస్ వారైతే ఒక నీతి, ప్రత్యర్థి టీడీపీకి చెందిన వారి విషయంలో మరోనీతితో వ్యవహరించేవారు. ఇప్పుడైతే వైసీపీ నేతలు ఏది చేసినా ఆహా, ఓహా అని కీర్తించడం, టీడీపీ, ఇతర పక్షాలు ఏం చేసినా ఛీఛీ అనడం సాక్షి లక్షణం.
ఆరేడేళ్ల క్రితం మాట.కడప జిల్లాలో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే కుమారుడు రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివేవాడు.ఒకరోజు కళాశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ వార్తను క్యారీ చేయకపోగా, ఎమ్మెల్యే కుమారుడు చాలా మంచివాడంటూ ఆ కళాశాల అధ్యాపకులు,కొందరు విద్యార్థులతో అభిప్రాయాలను అచ్చు వేశారు. దీంతో జనంలో పత్రిక నవ్వులపాలైంది.
ప్రస్తుత విషయానికి వస్తే ఏపీ అసెంబ్లీలో రెండోరోజు ‘సన్నబియ్యం’పై చర్చ.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో సన్న బియ్యం అనే పేరే లేదన్నారు.నాణ్యమైన బియ్యం,సన్న బియ్యం తేడా తెలియకుండా సాక్షి పేపర్‌లో తప్పుగా రాశారని నాటి ఆ పత్రిక చైర్మన్ అయిన సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తమకు ఉపయోగపడేదైతే ఒప్పు, రాజకీయంగా ఇడ్డందులు తెచ్చేదైతే తప్పు…ఇదే అన్నమాట ఉన్నది ఉన్నట్టు…ఉండదు కనికట్టుకు అర్థం. దీనికి జగన్ మాటలే నిలువెత్తు ‘సాక్షి’