చాటుమాటుగా సాగించేవి.. ఖచ్చితంగా తప్పుడు పనులే! ఏదో దేశ రక్షణకు, వ్యక్తుల భద్రతకు సంబంధించిన సందర్భాల్లో కొన్ని విషయాల్లో మాత్రం ‘రహస్యం’ పాటించాల్సి ఉంటుంది. అలాకాకుండా… ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వ్యవస్థలు, యంత్రాంగాల్లో కూడా.. రహస్యం పాటిస్తే గనుక.. ఖచ్చితంగా అందులో ఏదో తప్పుడు వ్యవహారం జరుగుతున్నట్లే లెక్క. తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో దైవదర్శనానికి ఎవరెన్ని దళారీ పనులకు పాల్పడుతున్నారో.. ఎవరెవరు దళారీలకు సహకరిస్తున్నారో… లెక్కతేల్చడానికి చిన్న సాంకేతిక ఏర్పాటు సరిపోతుంది. కొత్తగా తితిదే అధ్యక్షుడిగా పాలన స్వీకరించిన వైవి సుబ్బారెడ్డి.. ఇలాంటి విషయాలపై దృష్టి సారించి.. ఒత్తిళ్లకు లొంగని నిర్ణయాలు తీసుకుంటే గనుక.. ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటగిరినాధుని దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వీరిలో ముఖ్యులకు వీఐపీ కోటాలో త్వరితగతిన ప్రత్యేకదర్శన భాగ్యం దక్కేలా ఏర్పాటు చేయడం అవసరమే. ఆ మాత్రం వెసులుబాటు ఉండాల్సిందే. కానీ.. ఆ ముసుగులో దళారీలు పెచ్చరిల్లుతోంటే ఏం చేయాలి? దేవుడిని బజారు సరుకులాగా అమ్మకానికి పెట్టేసి.. ‘‘రెండు సిఫారసు లెటర్లు పెట్టించుకోగలిగితే చాలు.. రోజుకు లక్ష రూపాయలు వచ్చేస్తాయి..’’ అని బరితెగించి బాహాటంగానే అనగలిగిన దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
గుప్పిట మూసి ఉంచినంత కాలమే దొంగపనులు, దళార్ల దోపిడీలు సాగుతాయి. ఒక్కసారి గుప్పిట విప్పితే.. ఇక వారి ఆటలు కట్టుతాయి.వైవీ సుబ్బారెడ్డి తాను పగ్గాలు స్వీకరించిన తర్వాత ఇలాంటి మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపించింది.
ఆయన రాగానే ఎల్1, ఎల్2 దర్శనాలను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను సంపన్న భక్తులు పొందడానికి 10వేల రూపాయల విరాళాన్ని ధరగా నిర్ణయించారు. దాంతో అంతకంటె ఎక్కువ మొత్తాలే దోచుకుంటున్న దళారీల ఆటలకు చిన్న బ్రేక్ పడింది. కానీ వారి ఆట పూర్తిగా కట్టలేదు.
వైవీ సుబ్బారెడ్డి తన హయాంలో నిజంగానే తిరుమలలో సంస్కరణలు తేదలచుకుంటే గనుక..దైవ సేవలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా మిగిలిపోవాలనుకుంటే గనుక.. దృష్టి సారించవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి.
‘‘వేంకటేశ్వరుని దర్శనానికి వీఐపీలను ప్రత్యేకంగా అనుమతించడం అవసరమే. దేవుని ఎదుట అందరూ సమానమే.. అందరికీ ఒకటే లైను ఉండాలి’’ వంటి నీతిసూత్రాలు వినడానికి బాగానే ఉంటాయి గానీ.. ఆచరణలో చాలా ఇబ్బంది ఉంటుంది. కారణాలు ఏమైనప్పటికీ.. ముఖ్యులకు ప్రత్యేక దర్శనాలు ఉండడంలో తప్పు లేదు. అందుకే వీఐపీ దర్శనాలను అభ్యంతరపెట్టడంలో అర్థం లేదు. కానీ.. ఆ ముసుగులో దళారీల దోపిడీని మాత్రం అరికట్టాల్సిందే.
హోటళ్లలో సిఫారసులు…
సాధారణంగా ప్రోటోకాల్ హోదా ఉన్న వారి సిఫారసు ఉత్తరాలకు వీఐపీ దర్శనాలు లభిస్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అత్యున్నతస్థాయిలోని అధికారుల ఉత్తరాలకు పరిగణన ఉంటుంది. ప్రతిరోజూ వచ్చిన సిఫారసు లేఖల స్థాయిని బట్టి వారికి ప్రత్యేకదర్శనాలను తిరుమలలోని జేఈఓ కార్యాలయం కేటాయిస్తుంది. కొన్ని సిఫారసు లేఖలను రిజెక్టు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. విధానం పరంగా చూసినప్పుడు ఇందులో మనకు లోపం కనిపించదు.
కానీ.. ఎమ్మెల్యేలు సంతకం చేసిన సిఫారసు లేఖలు తిరుపతిలోని కొన్ని హోటళ్లలో విక్రయానికి దొరుకుతుంటాయి. స్పెషల్ దర్శనాలను ఏర్పాటు చేయగల దళారీలు వీటితో తమ క్లయింట్లను కలుస్తారు. ఒక్కోస్థాయి దర్శనానికి ఒక రేటు పెడతారు. తల ఒక్కింటికి ఐదునుంచి పదిహేను వేల రూపాయల దాకా ఈ ధర ఉండవచ్చు. క్లయింట్లు తమ పేర్లు, ఆధార్ నెంబర్లు, తత్సంబంధిత డాక్యుమెంట్లు ఇస్తే చాలు.. తతిమ్మా వ్యవహారం ఆ దళారీ చూసుకుంటాడు. వారి పేర్లను వారు చెల్లించే ధరను బట్టి ఎవరి సిఫారసు లెటరుకు జతచేసి.. ఆఫీసులో ఇవ్వాలి..? ఆ తరువాత ఎవరెవరిని కలిసి ముడుపులు సమర్పించుకోవాలి? ఏ ప్రత్యేకదర్శనం వారికి లభించే ఏర్పాటు చేయాలి..? అనేది దళారీ చూసుకుంటాడు.
సదరు సిఫారసు లేఖల మీద ఖాళీగా ఉండగానే.. సంతకాలు చేసి ఇచ్చేసే ప్రజాప్రతినిధులకు లేదా వారి తైనాతీలకు ఎటూ కొంత వాటా ముడుతూనే ఉంటుంది.
దళారీలకు ముసుగులు అనేకం…
తిరుమలలో ప్రత్యేక దర్శనాలను కేటాయించే జేఈఓ ఆఫీసు ఎవరెవరి సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుంటుంది… అనేది కూడా ఒక పెద్ద మాయ. ఉదాహరణకు మీడియా వారికి కూడా లెటర్లు పెట్టే వెసులుబాటు ఉంది.
మీడియా యాజమాన్యాల సూచన మేరకు స్థానిక ప్రతినిధులు లెటర్లు పెట్టి దర్శనాలు పొందుతుంటారు. కానీ.. తమ వద్ద ఉండే లెటర్లను దళారీ పనులకు వాడుకుంటూ.. ఒక్కో ఏడాదిలో వందలు, వేల సంఖ్యలో వీఐపీ దర్శనాలు పొందుతున్నారనే సంగతి ఆ మధ్య ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. ఆ రకంగా వారంతా కలిసి కోట్లలో స్వాహా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గగ్గోలు అయిపోయింది. మీడియా లాగానే సిఫారసులు ఇచ్చే అధికారంతో ఇతర వ్యవస్థలూ ఉన్నాయి. అసలు తప్పుడు పని చేయడానికి వెసులుబాటే లేకుండా చేస్తే ఇంకా మంచిది కదా అనేది టీటీడీ ఆలోచించాలి.
మంత్రుల పేషీల నుంచి…
మంత్రుల పేషీలనుంచి కూడా సిఫారసు ఉత్తరాలు వెల్లువెత్తుతుంటాయి. వీరికి నిర్దిష్టమైన కోటా ఉంటుంది. ఒకరోజుకు ఇంతమందికి మాత్రమే మీరు లెటర్లివ్వండి అని టీటీడీ నుంచి అప్రకటిత సూచన ఉంటుంది. ఆ కోటా పూర్తిగా మంత్రుల పేషీలనుంచి సిఫారసు లేఖలు పుడుతుంటాయి. వాటన్నింటనికీ దాదాపుగా ప్రత్యేక దర్శనాలు దక్కుతుంటాయి.
తమాషా ఏంటంటే.. ఏ ఒక్క మంత్రి పేషీ నుంచి కూడా సిఫారసు లేని రోజంటూ తిరుమలలో ఉండదు. ఏమాత్రం ఖాళీ లేకుండా సిఫారసులు పుడుతూనే ఉంటాయి. వీటికీ అంతూ దరీ ఉండదు. మంత్రిస్థాయిలో రాష్ట్ర ప్రజలకు సేవ చేసే బాధ్యతను మోస్తున్నప్పుడు.. ఖచ్చితంగా వారికి ఆ మాత్రం సిఫారసు చేయగల విశేషాధికారం ఉండాలి. దానిని మనం తప్పుపట్టకూడదు. కానీ ఆ సిఫారసు లేఖలను దక్కించుకుంటున్న వారెవ్వరు? ఒకే వ్యక్తికి ఏడాదిలో ఎన్ని సార్లు సిఫారసులు దక్కుతున్నాయి? అనేది ఆలోచించాల్సిన సంగతి.
సాధారణంగా మంత్రుల నుంచి వచ్చే లేఖల్లో ఒక వ్యక్తి పేరు మాత్రం రాస్తారు. వారితో పాటు ఆరుగురికి ప్రత్యేక సిఫారసులు దక్కుతాయి. ఒకే వ్యక్తి.. ఏడాదిలో పలుమార్లు లేఖలు తీసుకుంటారు. ఆ ఒక్క పేరుకు తోడు తిరుమల జేఈవో ఆఫీసులో దానిని సబ్మిట్ చేసేప్పుడు… కలిపే మిగిలిన ఐదు పేర్లలో మతలబు ఉంటుంది. మంత్రి ముగ్గురిని ఉద్దేశించి సిఫారసు ఇస్తే మరో ముగ్గురి పేర్లను ‘లోకల్‌గా’ కలపడం జరుగుతుంది. ఆ ‘కలిపే’ టికెట్ల ధర ఒక్కోటీ పదివేలకు పైమాటే ఉంటుందనడంలో సందేహం లేదు.
దోపిడీని అరికట్టడం ఎలా?
(1) సిఫారసు ఉత్తరాల ద్వారా ప్రత్యేక దర్శనాలు పొందుతున్న వారి పేర్లు, ఆధార్ నెంబర్లు టీటీడీ వెబ్ సైట్‌లో ఆన్‌లైన్‌లో ఉంచాలి. (2) ఏ హోదాగల వారు రోజుకు ఎన్ని లేఖలు పంపుతున్నారో, ఎంతమందికి సిఫారసు చేస్తున్నారో.. అందులో స్పష్టంగా ఉండాలి. (3) ఏయే కేటగిరీలకు చెందిన వారికి సిఫారసు లేఖలు ఇచ్చే హోదా ఉన్నదో, వారి కోటా ఎంతో కూడా ఆన్‌లైన్‌లో స్పష్టంగా కనిపించాలి.
ఇలా సిఫారసు ఉత్తరాల ద్వారా దర్శనాలు పొందే వారి వివరాలు ఆన్‌లైన్ కావడం వలన దోపిడీని అరికట్టినట్టు అవుతుంది. దీనివలన.. కేటాయించే బాధ్యతల్లో ఉండే సిబ్బంది.. అయినవారికి అడ్డదోవల్లో దోచిపెట్టడం తగ్గుతుంది.
నిజానికి ఈ సిఫారసు బాగోతాల వివరాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే టీటీడీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆర్టీఐ ద్వారా ప్రజలు తెలుసుకోగలిగే అవకాశం ఉన్న వివరాలన్నిటినీ.. ఎవరూ అడగకముందే.. ఆన్‌లైన్‌లో ఉంచేస్తే.. వారి మీద సామాన్య భక్తులకు గౌరవం పెరుగుతుంది.
తమ పేరిట తిరుమలలో దళారీల దోపిడీ జరుగుతుంటుందనేది చాలా సందర్భాల్లో ఆ మంత్రులకు కూడా తెలియదు. ప్రధానంగా ఈ సిఫారసు ఉత్తరాల వ్యవహారాన్నే ఆన్‌లైన్ పద్ధతిలోకి తీసుకువెళ్లాలి.
మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, బోర్డు సభ్యులైనా, ఉన్నతాధికార్లయినా.. తమ సిఫారసును టీటీడీకి ఆన్‌లైన్ లోనే సబ్మిట్ చేయాలి. అందులో తాము సిఫారసు చేస్తున్న అందరు వ్యక్తుల పేర్లు, ఆధార్ నెంబర్లు విధిగా పేర్కొనాలి. వారి యూజర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ ప్రొటెక్షన్ తో మాత్రమే వారు సిఫారసు ఉత్తరాల్ని సబ్మిట్ చేయాలి.
దీనివలన దొంగఉత్తరాలన్నీ తక్షణం తగ్గిపోతాయి. ఒకసారి సిఫారసు మీద దర్శనానికి వచ్చిన వీఐపీ.. కనీసం ఏడాది వరకు మళ్లీ మరొక సిఫారసుతో రాకుండా కట్టడి చేయాలి. ఎన్ని నకిలీ లేఖలు వస్తున్నాయో.. ఎమ్మెల్యేల సిఫారసులు అమ్మకానికి బజార్లో దొరకడం, మంత్రి- ఒక వ్యక్తి దర్శనానికి లేఖ ఇస్తే.. లోకల్‌గా మరో అయిదు టికెట్లకు అమ్ముకోవడం.. లాంటి అరాచక వ్యవస్థలన్నీ ఈ ఒక్క నిర్ణయంతో కట్టడి అవుతాయి.
టీటీడీ వెబ్ సైట్ లో రిజిస్టర్డు యూజర్లు ఎవరైనా సరే.. ఎప్పుడైనా సరే.. ఇలా సిఫారసుల ద్వారా దర్శనాలు పొందుతున్న వ్యక్తుల వివరాలను, వారికి లేఖలు ఇస్తున్న ప్రముఖుల వివరాలను తెలుసుకోగలిగే ఏర్పాటు ఉండాలి. ఇలాంటి ఏర్పాటు వల్ల.. లేఖలు ఇచ్చే వాళ్లు కూడా కాస్త జవాబుదారీతనంతో వ్యవహరిస్తారు.
నిజంగానే దళారీల దోపిడీని అడ్డుకోవాలనే ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి ఉంటే గనుక.. ఈ లేఖల్ని ఆన్‌లైన్ చేసే దిశగా అడుగులు పడాలి. దళారీలు కొత్త మార్గాలు వెతుక్కుంటారు. వాటిని బట్టి… మరో విడతలో.. ఆన్‌లైన్ విధానంలో కొన్ని మార్పు చేర్పులు చేసి.. వ్యవస్థను పటిష్టం చేయాలి. దేవుడి పేరుమీద దళారీలు సాగించే అకృత్యాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేస్తే అది కూడా సరైన భగవత్సేవ అనిపించుకుంటుంది.
… కె.ఎ. మునిసురేష్ పిళ్లె