గుండెకాయ లాంటి కీలక విభాగం ఇపుడు విశాఖ ఉక్కులో గల్లంతు కాబోతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన తరువాత కేంద్రం వేస్తున్న అడుగులు దూకుడుగా ఉంటున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ లో అతి ముఖ్యమైన కోకో ఒవెన్ బ్యాటరీ విక్రయానికి రంగం సిధ్ధం చేశారు.
దీనికి సంబంధించి తాజాగా టెండర్లను కూడా పిలిచారు. ఈ మొత్తం వ్యవహారం చివరి నిముషం వరకూ బయటకు పొక్కకకుండా చాలా సీక్రెట్ గా యాజమాన్యం వ్యవహరించడమే ఇక్కడ ఎత్తుగడ అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉక్కు బ్యాటరీని అమ్మకానికి పెట్టడం ద్వారా విశాఖ ఉక్కుకు చెల్లు చీటి రాసేందుకు యాజమాన్యం అడుగులు వేస్తోందని అంటున్నారు.
విశాఖ స్టీల్ కి కోకో ఒవెన్ బ్యాటరీ అతి ముఖ్యమైన భాగంగా కార్మిక నాయకులు చెబుతున్నారు. ఈ విభాగంలో కోకోతో పాటు, వివిధ రకాలైన గ్యాస్, విధ్యుత్ సహా మరెన్నో రకాలైన అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇంతటి ముఖ్యమైన విభాగాన్ని ప్రైవేటు పరం చేస్తే ఉక్కు కర్మాగారం ఇండైరెక్ట్ గా ప్రైవేట్ పరం అయినట్లే అంటున్నారు.
ఈ విభాగంలో రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇపుడు ప్రైవేట్ చేస్తే వారి జీవితాలు అన్నీ అంధకారం అవుతాయని కూడా కార్మిల సంఘాల నేతలు అంటున్నారు. ఉక్కులో ఒక కీలక విభాగాన్ని ప్రైవేట్ కి అప్పగించడం అంటే చరిత్రలో ఇదొక అనూహ్య ఘటనగానే చూడాలి అంటున్నారు.
ఇంతటి కీలకమైన విభాగంలో మరో రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, నియామకాలు చేపడితే ఉక్కు నిర్వాసితులకు ఆ చాన్స్ వస్తుందని అంటున్నారు. ఇకా ఇపుడు ఉన్న అయిదు బ్యాటరీలతో పాటు ఆరవ బ్యాటరీ నిర్మాణాన్ని కూడా చేపట్టి అన్ని విధాలుగా విస్తరించాల్సిన తరుణంలో ప్రైవేట్ పరం అంటే విశాఖ ఉక్కు భవిష్యత్తుని మొత్తం చీకటిలోకి నెట్టేయడమే అని వారు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే కొందరు ఉన్నతాధికారులకు తెలిసే కోకో ఓవెన్ బ్యాటరీ ప్రైవేటీకరణ కధ ముందుకు నడించింది అంటున్నారు. ఇంతకాలం ఉక్కు ఉప్పు తిని సొంత సంస్థకే ద్రోహం తలపెడతారా అని కార్మిక నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరేమనుకున్నా నా దారి రహదాని అంటూ కేంద్రం ఉక్కుని తుక్కు చేసేందుకు పకడ్బంధీగానే యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. మరి ఉద్యమం ఎలా చేపడతారు, ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారు అన్నది చూడాల్సిందే.