పునరావృతం కాకూడదని హెచ్చరించాం!

నాగాలాండ్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో సామాన్య ప్ర‌జ‌లు 14 మంది చ‌నిపోతే….కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పొర‌పాటైంద‌నే ఒకే ఒక్క మాట‌తో స‌రిపెట్టారు. సామాన్యుల ప్రాణాలంటే ఎంత అలుసో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. క‌నీసం…

నాగాలాండ్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో సామాన్య ప్ర‌జ‌లు 14 మంది చ‌నిపోతే….కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పొర‌పాటైంద‌నే ఒకే ఒక్క మాట‌తో స‌రిపెట్టారు. సామాన్యుల ప్రాణాలంటే ఎంత అలుసో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. క‌నీసం పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌కు కూడా అవ‌కాశం లేకుండా కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా వివ‌ర‌ణ‌తో ముగించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

నాగాలాండ్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పొర‌పాటున సామాన్యుల‌ను చూసి ఉగ్ర‌వాదులుగా భావించి కాల్పుల‌కు దిగార‌ని అమిత్‌షా ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల ద‌గ్గ‌రికి ఉగ్ర‌వాదులు చూసి పోతామ‌ని న‌వ్వుతూ వ‌స్తారా? అనే వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తాయి. ఉగ్ర‌వాదులైతే భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ‌కుండా ఉంటార‌నే క‌నీస జ్ఞానం కూడా లేక‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

నాగాలాండ్‌లో సామాన్య పౌరుల చావులు దేశ వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి క‌లిగిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేంద్రం ప‌శ్చాత్తాప ప‌డుతున్న‌ట్టు అమిత్‌షా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై లోక్‌స‌భ‌లో ఆయ‌న ఏమ‌న్నారంటే…

‘ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. దీంతో డిసెంబరు 4వ తేదీన ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్‌ మెరుపు దాడి చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి. అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అందులో ఉన్నది ఉగ్రవాదులు అని అనుమానించిన దళాలు.. ఆ వాహనంపై కాల్పులు జరిపాయి. వాహనంలోని ఆరుగురు మరణించారు. ఆ తర్వాత పొరబాటు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి.  

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. అయితే త‌మ‌వారు ఆరుగురు మృతి చెందార‌ని తెలుసుకుని స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత డిసెంబరు 5 సాయంత్రం కూడా స్థానికులు ఆర్మీ ఆపరేటింగ్‌ బేస్‌పై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అస్సాం రైఫిల్స్‌ కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు’ అని అమిత్‌ షా చెప్పారు.

ఈ ఘటనపై ఆర్మీ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అమిత్‌షా చెప్పారు. దీంతో పాటు సిట్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నెల రోజుల్లోగా నివేదిక ఇస్తుందని, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని ఆయ‌న‌ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భద్రతా బలగాలను హెచ్చరించినట్లు అమిత్ షా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా వుండ‌గా నాగాలాండ్‌ ఘటనపై చర్చ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. అయితే స్పీక‌ర్ అంగీక‌రించ‌లేదు. కేవ‌లం అమిత్ షా వివరణ మాత్రమే ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సభలో ప్ర‌తిప‌క్షాలు ఆందోళనకు దిగాయి. చ‌ర్చ‌కు స్పీకర్ స‌సేమిరా అన‌డంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

చింతిస్తున్నాం, పొర‌పాటైంది, పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అమిత్‌షా చెప్ప‌డం బాగుంద‌ని, మ‌రి పోయిన ప్రాణాలు తిరిగి వ‌స్తాయా? అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి. సామాన్య ప్ర‌జ‌ల ప్రాణాల‌పై ఎందుకంత చిన్న చూపు అని కేంద్రాన్ని ప్ర‌తిపక్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.