పీవీ సమాధికి కాషాయ శిబిరం పూజలు చేయాల్సిన దినమిది

మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) నేతలు హైదరాబాద్‌ వచ్చి నివాళులర్పించాల్సిన రోజు ఇది (2021,డిసెంబర్‌ 6). ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 1971 సెప్టెంబర్‌–73…

మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) నేతలు హైదరాబాద్‌ వచ్చి నివాళులర్పించాల్సిన రోజు ఇది (2021,డిసెంబర్‌ 6). ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 1971 సెప్టెంబర్‌–73 జనవరి మధ్య కాలంలో ఏడాది మూడు నెలలు మాత్రమే కొనసాగగలిగిన పీవీ– ప్రధానిగా ఐదేళ్లూ ఉన్నారు. 

ప్రధానమంత్రి పదవిలో దాదాపు ఏడాదిన్ననర కాలం సంపూర్ణ అధికారం చెలాయించాక–భారతీయులంతా గుర్తుంచుకునేలా ఆయన దేశానికి ఏమైనా చేద్దామనుకున్నారు. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలోని వివాదాస్సద కట్టడం బాబరీ మసీదును సంఘ్‌ పరివారం ఈసారి తప్పకుండా కూల్చేయాలనే పట్టుదలతో ఉందనే ఖచ్చితమైన సమాచారం ఉన్నా, వారిని ఆ పనిచేయనిస్తే–1948 నుంచీ దేశాన్ని పట్టిపీడిస్తున్న మందిర్‌–మసీదు సమస్య తీరిపోతుందని నరసింహారావు గారు భావించారు. 

ఆ రోజు మసీదును కూల్చకుండా కాపాడడానికి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పీవీ వారిని అందుకు అనుమతించలేదు. సెలవురోజైన ఆ డిసెంబర్‌ మొదటి ఆదివారం రోజు అయోధ్య మసీదుపైకి ఓ కుర్రాడు చేరుకోగలిగాడనే సమాచారం తెలిశాక భారత ప్రధాని కొత్త దిల్లీలోని తన అధికార నివాసంలోని తన పూజగదిలో కూర్చుని ‘రామజన్మభూమి వివాదానికి పరిష్కారం ఈరోజే చూపండి,’ అంటూ మూడు కోట్ల ముప్పయి లక్షల మంది హిందూ దేవలతలను ప్రార్థించారు. 

మసీదు మధ్యాహ్నాన్నానికల్లా కూలిపోయింది. కూలినచోటే మళ్లీ సీతారాముల విగ్రహాలొచ్చి కూర్చున్నాయి. బాబరీ మసీదు నేలమట్టమైన 27 ఏళ్లుకు సుప్రీం కోర్టు తీర్పు కూడా రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా వచ్చింది. మసీదు కట్టిన నేలపైనే తల్లి కౌసల్య శ్రీరాముడిని ప్రసవించిందనే హిందువుల విశ్వాసం గట్టిదని కూడా సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పులో చెప్పింది. అయోధ్యలో రాముడి గుడి కట్టడానికి మొదట పాములపర్తి వారు ఆలయ స్థలాన్ని ఎలాంటి కూలి ఇవ్వకుండా విపక్షం కార్యకర్తలు, కార్‌ సేవకులతో శుభ్రం చేయించారు. చక్కగా సాఫ్‌ చేయించిన  తర్వాత, భవ్య మందిర నిర్మాణానికి  భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ)తో పునాదులు ఊడా తవ్వించారు పీవీ. 2019 నవంబర్‌ మాసంలో సుప్రీంకోర్టు కూడా ఆలయ నిర్మాణానికి గ్రీన్‌ లేదా సఫ్రన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

ఇప్పుడు అక్కడ భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 1990 అక్టోబర్‌ 30న సంఘ్‌ పరివారం కార్యకర్తలు మొదటిసారి బాబరీ మసీదుపైకి ఎక్కి దాన్ని కూల్చడానికి చేసిన గట్టి ప్రయత్నం అప్పటి ముఖ్కమంత్రి ములాయం సింగ్‌ యాదవ్, ప్రధానమంత్రి విశ్వనాథప్రతాప్‌ సింగ్‌ కారణంగా విఫలమైంది. కార్‌ సేవకుల పట్టుదల వల్ల  పక్కనున్న సరయూ నది నీరు ఎర్రబడిందిగాని మసీదు నేలమట్టం కాలేదు. రెండేళ్ల తర్వాత వచ్చిన శీతాకాలంలో అనుకున్న పని– అనుకూల ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్, ప్రధాని పీవీ ప్రత్యక్ష, పరోక్ష సహకారాలాతో జరిగిపోయింది.

మసీదు కూలినాక పీవీ పీఠం గట్టిపడింది

29 ఏళ్ల క్రితం అయోధ్యలో మసీదును కూల్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా పీవీ ప్రధాని పదవిలో మూడున్నరేళ్లు కొనసాగి తన పదవీ కాలం పూర్తిచేసుకున్నారు. అంతే కాదు, మసీదు కూల్చివేతకు మౌనసాక్షిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పెల్లుబికిన విమర్శలు, ప్రతిపక్షాల నిందలు భరించి, ఆ తర్వాత పుష్కరకాలం నరసింహారావు గారు జీవించారు. తాను తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొనడానికి కారణమైన మసీదు కూల్చివేత జరిగిన చలికాలం డిసెంబర్‌ లోనే 2004లో ఆయన కన్నుమూశారు. 

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పార్థివదేహం చితి మంటల్లో పూర్తిగా కాలిపోలేదనే విషయం తెలిశాక అర్ధరాత్రి ఆ పనిని రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారు విజయవంతంగా పూర్తి చేసింది. కాని, పీవీ గొప్పతనం కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ, ఆయన సంతానం ఇంకా గుర్తించకుండా ఆయన యాదికి ఎనలేని హాని, అపమానం చేశారు. అందుకే ఏడేళ్లుగా కాంగ్రెస్‌ లోక్‌సభలో కనీసం గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కునారిల్లుతోంది. 

మరోపక్క బాంగ్లా బ్రాహ్మణ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ– పీవీ నరసింహారావు వదిలిపోయిన అజెండాను (కాంగ్రెస్‌ను తెరమరుగు చేయడం) పూర్తి చేయడానికి శతవిధాలా కృషిచేస్తున్నారు. ఈ పవిత్రయజ్ఞంలో మమతకు ప్రశాంత్‌ కిశోర్‌ పాండే అనే బిహారీ బ్రాహ్మణ చాణక్యుడు తన వంతు సహకారం అందిస్తున్నాడు.

కారణజన్ముడు పీవీ నరసింహారావు గారు

ఎంతైనా పీవీ నరసింహారావు గారు కారణజన్ముడు. ధన్యజీవి. తెలుగువారికి, తెలంగాణకు, భారత దేశానికి ఆయన వల్ల గొప్ప గుర్తింపు వచ్చింది. ఆయనను తెలుగునాట ఓ సామాజికవర్గం ప్రేమతో పిలుచుకునే అపర చాణుక్యుడు అనే పేరుకు తగ్గట్టే పీవీ  ప్రధానిగా దేశాన్ని ఏలారు. ఆదివాసీ, దళిత, బీసీ లోక్‌ సభ సభ్యులు కొందరి బ్యాంకు అకౌంట్లలో (బ్యాంక్‌ బరోడా, పార్లమెంటు స్ట్రీట్‌ బ్రాంచి) 50 లక్షలకు పైగా సొమ్ము జమచేయించారు ధైర్యంగా. 

మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణలు అమలు చేసి పవిత్ర భారతాన్ని కాపాడారనే పేరు పీవికి వచ్చింది. కాని, ముక్కోటి దేవతల దయతో నరసింహారావు బాబరీ మసీదు కూల్చివేతకు పరోక్షంగా సాయమందించి భారత చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసుకున్నారు. మసీదు విధ్వంసం జరిగి 30 ఏళ్లు నిండే 2022లో నైనా నరేంద్ర మోదీ సర్కారు పీవీ గారికి భరత రత్న ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. 

తెలుగు ప్రజలు ముఖ్యంగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో బతుకుతున్న తెలంగాణ ప్రజానీకం గర్విస్తుంది– ఇన్నాళ్లకు తమ ముద్దు బిడ్డకు భారత రత్న వచ్చినందుకు. ఈ పని జరగగానే, తెలంగాణలోనే స్థిరపడిన నందమూరి తారక రామారావు గారి సంతానం తమ తండ్రికి కూడా భారతరత్న ఇవ్వాలని గొడవ చేయకపోతే అందరికీ శ్రేయస్కరం. పీవీలా ఎన్టీఆర్‌ ప్రపంచమంతా లేదా దేశమంతా గుర్తుండి పోయే పనేమీ చేసి పోలేదని నందమూరి వంశజులు తెలుసుకుంటే రామారావుగారికి అంతకన్నా గొప్ప నివాళి ఏమీ ఉండదు. 

తెలంగాణ బ్రాహ్మణ బిడ్డతో కోస్తా కమ్మ ప్రముఖుడిని పోటీకి పెట్టకండి. తెలుగువారి ఐక్యతను కాపాడండి. ఎన్టీఆర్‌ కు కూడా భారతరత్న ఇస్తే–నీలం సంజీవరెడ్డికో. మర్రి చెన్నారెడ్డికో లేదా వైఎస్‌ రాజశేఖరరెడ్డికో ఈ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌ బలమున్న మరో తెలుగు వర్గం నుంచి చెవులు హోరెత్తిపోయేలా వినిపిస్తుంది. 

అందుకే మనమంతా భారతరత్నకు అన్ని అర్హతలున్న ఏకైక తెలుగు తేజం పాములపర్తి వేంకట నరసింహారావు గారు ఒక్కరే అనే ఏకాభిప్రాయం సాధించి ఆ దిశగా ముందుకుపోదాం. మన ఆకాంక్షను తీర్చడానికి ఆరెసెస్, బీజేపీ నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. కొత్త సంవత్సరంలో పీవీకి భారతరత్నతోపాటు తెలుగోళ్లందరికీ అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం.

నాంచార‌య్య మెరుగుమాల‌