కుప్పం పరాభవం.. సాకులతో చంద్రబాబు కాలక్షేపం

కుప్పం స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. దర్శి, కొండపల్లి స్థానాల్లో టీడీపీ పరువు కాపాడుకున్నప్పటికీ.. కుప్పంలో రోజురోజుకీ పార్టీ దిగజారి పోవడానికి అక్కడి ఎమ్మెల్యే చంద్రబాబు కారణం కాదా..?  Advertisement ఇదే…

కుప్పం స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. దర్శి, కొండపల్లి స్థానాల్లో టీడీపీ పరువు కాపాడుకున్నప్పటికీ.. కుప్పంలో రోజురోజుకీ పార్టీ దిగజారి పోవడానికి అక్కడి ఎమ్మెల్యే చంద్రబాబు కారణం కాదా..? 

ఇదే ప్రశ్న తలెత్తే సమయానికి అసెంబ్లీ నుంచి వాకవుట్ చేసి, బయట మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చి.. మొత్తంగా వ్యవహారాన్ని పక్కదోవ పట్టించారు బాబు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ కూడా పాతబడిపోయింది.

ఎప్పటికైనా పోస్టుమార్టం తప్పదు కదా..?

అసెంబ్లీ సమావేశాల సమయానికి కుప్పంపై చర్చ రాకుండా బాగానే మేనేజ్ చేశారు చంద్రబాబు. మరి ఇప్పుడైనా దాని గురించి చర్చించాలి కదా. కానీ చంద్రబాబు ఆ పని చేయడం లేదు. 

కనీసం కుప్పంలో తాను మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు లేనట్టుంది. ఒకవేళ ఉన్నా.. ఇప్పుడు జరిగిన పరాభవానికి తననే బాధ్యుడిగా చేస్తారని అనుకున్నారేమో. అందుకే కుప్పం పేరెత్తకుండా తప్పించుకుంటున్నారు.

పరాజయాన్ని స్వీకరించే దమ్ముందా..?

జయాపజయాలను సమానంగా తీసుకోగలిగినవాడే అసలైన నాయకుడు. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటేనే విజయం వరిస్తుంది. కానీ చంద్రబాబు పరాజయాల నుంచి ఎప్పుడూ పాఠాలు నేర్చుకోలేదు. అసలు టీడీపీని ఓడించడం నాయకుల తప్పు కాదు, ప్రజల తప్పు అని అనుకునే రకం బాబు. 

ఇప్పటికీ ఆయన అదే మాట అంటుంటారు. రాష్ట్ర విభజన సమయంలో అనుభవం అనే తప్పుడు భావనని జనంలోకి తీసుకెళ్లి బొటాబొటి పర్సంటేజితో ఒడ్డునపడ్డారు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన పాలన చూసి విసుగెత్తి జనం జగన్ ని అక్కున చేర్చుకున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం జగన్ ఒక్క ఛాన్స్ అంటూ బతిమిలాడుకుంటే గెలిచారని వెటకారంగా చెబుతుంటారు. తన తప్పుల్ని ఒప్పుకోకుండా, తన పరాజయాన్ని దైర్యంగా స్వీకరించకుండా సాకులు వెదుకుతుంటారు, ప్రజల్ని బద్నామ్ చేస్తుంటారు. కుప్పంలో కూడా అదే చేస్తారేమో.

ఏళ్ల తరబడి సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని పాపం చంద్రబాబుకి బాగానే తగులుకుంది. దాన్ని కప్పిపుచ్చుకోడానికి పడుతున్న తంటాల్లో కనీసం పావు వంతు, అసలేం జరిగింది అని ఆరాతీస్తే బాగుంటుందని అంటున్నారు స్థానిక నాయకులు. జనం గురించి కాకపోయినా, కనీసం స్థానిక నాయకుల గురించి ఆలోచించయినా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది.