చెత్త ఆలోచనలతో జీవించే వాళ్ల ఈగోలను సంతృప్తిపరిచేందుకు తాను లేనని ప్రముఖ గాయని, యాక్టివిస్ట్ చిన్మయి శ్రీపాద తేల్చి చెప్పారు. మహిళల సమస్యలు, ఇండస్ట్రీలో వారికి లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి శ్రీపాద పెద్ద ఉద్యమమే నడిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై భారీగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో అమ్మాయిల పెళ్లి గురించి మరోసారి తన మార్క్ స్పందన తెలియజేసింది.
'ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి అందరికీ చెబుతున్నాను. దీంతో మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని నా ఆశ. నాకేమో ఈ ఫారెన్ సంబంధం ఎప్పటికీ అర్థం కాదు. తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అస‍్సలు ఇవ్వరు. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లీ చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు' అంటూ ఇన్‌స్టాలో చిన్మయి రాసుకొచ్చింది .
'ఆర్థికంగా, స్వతంత్రంగా అమ్మాయిలు ఉంటే అవగాహనతో వేరే కాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భయం. ఫోర్స్ చేసి వెధవైనా పర్లేదు సొంత కాస్ట్‌లోనే పెళ్లి చేసుకోవాలి. తర్వాత కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ‍్మాయిలైన సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే హిస్టారికల్‌గా చూస్తే కూడా మనుషులకు కోపం వస్తుంది. బాలికల నుంచి సతీ సహగమనం లాంటి చెత్త సంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారీ ఇలాంటి కోపాన్నే ప్రదర‍్శించారు.
అందరు అబ‍్బాయిలు తమ సోదరీమణులకు ఇలానే చేస్తారా ? చేయనంటే వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వస్తే కోప్పడండి. మీ ఈగోలను సంతృప్తిపరచడానికి, మిమ్మల్ని శాంతింపచేసేందుకు నేను రాలేదు ' అంటూ ఆమె రాసుకొచ్చింది.
చిన్మయి తాను ఫీల్ అయిన అంశాలపై ఎలాంటి భయానికి లోనుకాకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటోంది. తాజా పోస్టు ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. పెళ్లి అనేది మనసుకు సంబంధించిన వ్యవహారమని, కానీ మన వ్యవస్థలో కులం ప్రాతిపదికన జరుగుతోందనేది ఆమె ఆవేదన.