ప్రపంచ మేటి మహిళ, ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూకీకి మయన్మార్ మిలిటరీ జుంటూ మరోసారి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సూకీతో పాటు పలువురు కీలక నేతలకు ఈ మేరకు శిక్ష విధిస్తూ సోమవారం జైలు శిక్ష విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆంగ్ సాన్ సూకీ సహా పలువురు కీలక నేతలను నిర్బంధించారు.
ఈ నేపథ్యంలో వారిపై అవినీతి, ఎన్నికల్లో మోసాలతో పాటు మరికొన్ని అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. ఇదే సందర్భంలో దేశ సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతోపాటు కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగానూ సూకీకి నాలుగేళ్ల జైలుశిక్ష విధించడం గమనార్హం.
సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు రెండేళ్లు, కోవిడ్‌కు సంబంధించిన ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరో రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు.
ఇదిలా వుండగా మయన్మార్ మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌కు సైతం ఇవే అభియోగాలపై నాలుగేళ్ల శిక్ష పడింది. వీరిని ఇంకా జైలుకు తరలించలేదు. ఎందుకంటే వీరిపై నమోదైన ఇతర అభియోగాలపై విచారణ జరుగుతోంది. వీటిలో దోషిగా తేలితే, వారికి దశాబ్దాలపాటు శిక్షపడే అవకాశం ఉన్నట్టు జుంటా ప్రతినిధి తెలిపారు.
ఆంగ్‌సాన్ సూకీకి జైలు జీవితం కొత్తకాదు. ఆమె సగ జీవితం జైల్లోనే గడిచిపోయింది. 1991లో నోబెల్ శాంతి బహుమతి, 1992లో జవహర్లాల్ నెహ్రూ అవార్డు పొందిన సూకీ 1989 నుంచి 15 ఏళ్ల పాటు నిర్బంధంలోనే గడపడం గమనార్హం.
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేతగా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన ఆంగ్ సాన్ సూకీ… 2010లో జైలు నుంచి విడుదలయ్యారు. అయినప్పటికీ ఆమె గృహ నిర్బంధంలోనే కొనసాగారు. మరోసారి అలాంటి పరిస్థితులే మయన్మార్‌లో ఉత్పన్నం కావడం విచారకరం.