ఏబీఎన్, టీవీ 5 చానళ్లపై మరోసారి నిషేధం. రెండు నెలల క్రితం ఆ రెండు చానళ్లపై నిషేధం విధించడం, తిరిగి పునరుద్ధరించడం తెలిసిందే. వారం క్రితం విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లతో సమావేశమై ఆ రెండు చానళ్లను నిషేధించాలని హుకుం జారీ చేసినట్టు వార్తలొచ్చాయి.
ఈ విషయమై వారం నుంచి ఏబీఎన్ గగ్గోలు పెడుతోంది. ఆ రెండు చానళ్లు ఊహించినట్టే నిన్నటి నుంచి ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో తెలుసుకో వీక్షకుడా అంటూ ఓ విజ్ఞప్తితో కూడిన సమాచారాన్ని ప్రచురించారు.
మీ కేబుల్ ఆపరేటర్ ఏబీఎన్ ప్రసారాలు ఇవ్వకపోతే వెంటనే ఫోన్ చేసి అడగాలని సూచించారు.అంతేకాదు రెండు సెల్‌నంబర్లు, రెండు ల్యాండ్ లైన్ నంబర్లు కూడా ఇచ్చారు.ఏబీఎన్ ఫ్రీ టూ ఎయిర్ చానల్ అని, ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఉచితంగా ఏబీఎన్ ప్రసారాలు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.దమ్మున్న ప్రేక్షకుడిగా మీ హక్కును సాధించుకోవాలని ఆంధ్రజ్యోతిలో కోరారు.
దీనికి తోడు ఏబీఎన్ చానల్‌లో ప్రసారాల నిలిపివేతకు ముందు నుంచి ఒకవేళ ప్రసారాలు ఆగిపోతే ఏం చేయాలో వినియోగదారుడికి పలు సూచనలు ఇచ్చారు. ఏది ఏమైనా మీడియా సంస్థలు రాజకీయంగా ఒక వర్గానికి మద్దతుగా నిలబడడం వల్లే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నది సత్యం.