విడుదల ఒకరోజు వుంది అనగా మళ్లీ చిక్కుల్లో పడింది ఆర్జీవీ సినిమా. ఆయన తీసిన కాంట్రావర్సీ ఫిల్మ్ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. సెన్సారు సర్టిఫికెట్ రాలేదు. కోర్టులో కేసులు పడ్డాయి. ఆఖరికి రివిజన్ కమిటీకి వెళ్లింది.
అక్కడ టైటిల్ ను 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' అని పేరు మార్చుకుని సెన్సారు క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు యూనిట్ నుంచి వార్తలు బయటకు వచ్చాయి. ఈ నెల 12న విడుదలకు అంతా సుగమం అయింది అనుకున్నారు. కానీ ఇప్పటికీ సెన్సారు సర్టిఫికెట్ రాలేదని తెలుస్తోంది.
రీజనల్ సెన్సారు అధికారి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని యూనిట్ వర్గాల బోగట్టా.
అసలు ప్రాసెస్ ఏమిటి? రివిజిన్ కు వెళ్లి వచ్చినా, ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు అన్నది తెలియాల్సి వుంది. ఈ మేరకు నిర్మాతలు మరి కొద్ది సేపట్లో సెన్సారు ఆఫీసు దగ్గరే ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. తాడో పేడో ఇక్కడే తేల్చుకుంటామని నిర్మాతల్లో ఒకరైన నట్టి కుమార్ అంటున్నారు.
ఇదంతా చూస్తుంటే రేపు అయినా సినిమా విడుదల అవుతుందా అన్నది అనుమానంగా వుంది.