పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రెండు వేల రూపాయల నోటు గురించి కేంద్రం వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. 'దాన్ని రద్దు చేయడం లేదు..' అంటూ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ ఉంది.మోడీ ప్రధానమంత్రి అయ్యాకా,ఆయన నోట్ల రద్దు అనే ప్రక్రియను చేపట్టాకా వ్యవస్థపై ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
అంతకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటు అంటే.. దానికో విలువ, గౌరవం ఉండేది.దాని మీద ఆర్బీఐ గవర్నర్ చేసే సంతకం గురించి కథలుకథలుగా చెప్పే వాళ్లు.ప్రపంచంలోని ఏ దేశం బ్యాంక్ కూడా అలా నోటుకు గ్యారెంటీ ఇవ్వదని,యూఎస్ డాలర్ నోటుకు కూడా ఉండని గ్యారెంటీ ఇండియాలో రూపాయి నోటుకు కూడా ఉంటుందని కొంతమంది విశ్లేషించే వారు.ఆ మేరకు ప్రతి నోటు మీదా ఉండే ఆర్బీఐ గవర్నర్ సంతకాన్ని ప్రస్తావించే వారు.
అయితే అలాంటి నమ్మకాలను తుత్తినయలు చేస్తూ.. నరేంద్రమోడీ అర్ధరాత్రి నోట్ల రద్దును ప్రకటించారు.అప్పటి నుంచి ఏ నోటు ఎప్పుడు రద్దు అవుతుంది? అనేది ప్రజల్లో సందేహంగానే మిగిలింది.ఇలాంటి విషయాల గురించి పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే రెండు వేల రూపాయల నోటు ప్రింటింగ్ ను స్టాప్ చేసినట్టుగా మోడీ ప్రభుత్వమే ప్రకటించింది. దీంతో
ఈ నోటు మనుగడ మీద మరిన్ని సందేహాలు నెలకొన్నాయి.దీంతో ఈ నోటును రద్దు చేసే ఆలోచన ఉందా? అంటూ పార్లమెంటులో కేందాన్ని సమాధానం కోరారు విపక్ష ఎంపీ ఒకరు.
ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది.అయితే ఏ అర్ధరాత్రి మోడీ ఏ నోటు గురించి ఏ ప్రకటన చేస్తారనేది మాత్రం మిస్టరీనే! అంత వరకూ రెండు వేల రూపాయల నోటుకు దినదినగండమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఈ పరిస్థితి నల్లధనికులను ఏం ఇబ్బంది పెట్టదు.ఈ నోటు రద్దు అయితే మరో నోటు ఎలా తీసుకోవాలో వాళ్లకు తెలుసు. ఎటొచ్చీ జనసామాన్యానికే భయం!