కర్ణాటకలో జేడీఎస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లోకి పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.తన కంచుకోటల్లో జేడీఎస్ పట్టు కోల్పోతూ ఉంది.ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువనేత నిఖిల్ గౌడ ఓటమి ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది.
కర్ణాటకలోని మైసూరు రీజియన్ జేడీఎస్ కు ఆటపట్టు.అందులోనూ మండ్య ఏరియా అంటే గౌడల ఖిల్లా.ఆ ప్రాంతంలో జేడీఎస్ కు తిరుగు ఉండదు ఎప్పుడూ.అక్కడ పోటీ జేడీఎస్- కాంగ్రెస్ ల మధ్యన ఎక్కువగా ఉంటుంది.బీజేపీ అక్కడ ఊసులో ఉండదు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ మండ్య జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి పది వేల ఓట్లు పొందితే అదే ఎక్కువ అనే పరిస్థితి ఉంటుంది.
ఇక కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలప్పుడు అయితే మండ్య జిల్లాలో జేడీఎస్ స్వీప్ చేసింది.అన్ని స్థానాల్లోనూ నెగ్గింది.అనూహ్యంగా కుమారస్వామి సీఎం అయ్యారు.అయితే ఆయన తనయుడు మండ్య నుంచినే ఎంపీగా పోటీ ఓటమి పాలయ్యారు.సుమలత అక్కడ ఇండిపెండెంట్ గా నెగ్గారు.
ఇక ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు మండ్య జిల్లాలో గట్టి ఝలక్ తగిలింది. కేఆర్ పేటలో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు.అక్కడ నుంచి ఇది వరకూ జేడీఎస్ తరఫున నెగ్గి, బీజేపీ వైపుకు వెళ్లిన నారాయణ గౌడ ఇప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేసి నెగ్గారు.తద్వారా కుమారస్వామికి గట్టి ఝలక్ ఇచ్చారు.
మరో విశేషం ఏమిటంటే.. మండ్య జిల్లా రాజకీయ చరిత్రలో తొలిసారి ఒక సీట్లో బీజేపీ నెగ్గింది! అయితే జేడీఎస్ లేకపోతే కాంగ్రెస్ అనే పరిస్థితుల్లో బీజేపీ తొలి సారి మండ్య డిస్ట్రిక్ట్ లో ఒక సీటు నెగ్గి సంచలనం రేపింది.ఇది జేడీఎస్ కు మింగుడుపడే పరిణామం కాదని పరిశీలకులు అంటున్నారు.లోక్ సభ ఎన్నికల్లో దేవేగౌడ,ఆయన మనవడు ఇద్దరూ ఓడిపోవడం, ఇప్పుడు మండ్యలోనూ పట్టు జారుతూ ఉండటం జేడీఎస్ ను ఇరకాటంలో పెడుతున్నట్టుగా ఉంది.