లోకేష్‌పై హత్యాయత్నం జరిగిందా?

కంగారు పడక్కర్లేదు లెండి. ఇలాంటి హెడింగు పెడితే తప్ప.. నెటిజన్లందరూ క్లిక్ చేసి చదవరు అనే కక్కుర్తితో పెట్టిన హెడింగు ఇది. కక్కుర్తి గ్రేటాంధ్ర ది కాదు. కొమ్ములు తిరిగిన మొనగాళ్లని చెప్పుకునే మెయిన్…

కంగారు పడక్కర్లేదు లెండి. ఇలాంటి హెడింగు పెడితే తప్ప.. నెటిజన్లందరూ క్లిక్ చేసి చదవరు అనే కక్కుర్తితో పెట్టిన హెడింగు ఇది. కక్కుర్తి గ్రేటాంధ్ర ది కాదు. కొమ్ములు తిరిగిన మొనగాళ్లని చెప్పుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియా వారిది. అంతలావు ఘనచరిత్ర కలిగిన మీడియా సంస్థలు కూడా.. కేవలం కిక్కు కోసం.. సారీ ‘‘క్లిక్కు’’ కోసం.. కక్కుర్తి హెడింగులు పెడుతున్నారు. అసలు విషయంతో సంబంధం లేకుండా.. చదివేవాడిలో కేవలం ఆసక్తి రేకెత్తిస్తే చాలు.. నిజానిజాలతో సంబంధం లేదు.. అనే తరహా చావు తెలివితేటలు లోక్లాస్ వెబ్ సైట్లకు ఉంటుంది. కానీ పెద్ద మీడియా సంస్థలు కూడా అదే పని చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఇంతకూ విషయం ఏంటంటే..

అసెంబ్లీ ఆవరణలో నారాలోకేష్ తదితరులు బస్సు దిగి నడిచి వస్తుండగా.. వారికి సమీపంలో ఒక డ్రోన్ కింద పడింది. అది అసెంబ్లీ ఆవరణలో భద్రత నిమిత్తం పోలీసులు ఆపరేట్ చేస్తున్న డ్రోనే. అది కెమెరాతో సహా కింద పడింది. ఆపరేట్ చేసేప్పుడు పొరబాటు వల్ల విద్యుత్తు తీగలు  తగిలి కింద పడింది.

అంతే మీడియా దాని మీద రాద్ధాంతం చేసేసింది. నారా లోకేష్, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్ రెడ్డిల సమీపంలో డ్రోన్ పడిపోయింది… వారికి ప్రమాదం తప్పింది.. అంటూ కథనాలు అప్ డేట్ లుగా వచ్చాయి. డ్రోన్ అదేదో హెలికాప్టర్ పడిపోయినట్లుగా భయం పుట్టించే వార్తలు ఇవి. నిజంగానే డ్రోన్ అంటే ఏమిటో తెలియని, దాని సైజు ఎంత ఉంటుందో తెలియని వాడు ఎవడైనా పాఠకుల్లో ఉంటే.. అయ్యో పాపం.. లోకేష్ మీద కూలేలాగా.. ఆ డ్రోన్ అనే దానిని ఎవరో ప్రయోగిస్తే.. ఏదో చినబాబు లక్కీ కాబట్టి… అది కాస్త దూరంగా పడింది… అనుకోవాల్సిందే..! ఆ కథనాలు అలా ఉన్నాయి.

నిజానికి డ్రోన్ ను ఎగరేసి మనమీద పడేసుకున్నా కూడా దెబ్బలేమీ తగలవు. అలాంటిది.. అది నడుస్తున్న వాళ్లకు కాస్త దూరంలో పడినందుకే… లోకేష్ కు ప్రమాదం తప్పింది.. అంటూ.. నానా చెత్తా రాయడం.. మీడియాలో ఇదేం చీప్ అలవాటో!??