అసలే కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి వుందనే భయాందోళనలు. మరోవైపు కరోనా కట్టడికి మాస్క్ ధరించడం లాంటి నిబంధనలను తప్పకుండా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తీనోరూ కొట్టుకుని వేడుకుంటున్నా పట్టించుకుంటున్న వాళ్లే లేరు. మరీ ముఖ్యంగా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ, సినీ సెలబ్రిటీలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి రెండురోజుల క్రితం డిశ్చార్జి అయిన లోకనాయకుడు, విలక్షణ హీరో కమల్‌హాసన్ నిబంధనలను పాటించకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం మండిపడుతోంది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న కమల్‌హాసన్ తమిళ బిగ్‌బాస్ షో షూటింగ్లో పాల్గొనడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్‌బాస్ షో షూటింగ్లో పాల్గొనడం ఏంటని ప్రభుత్వం నిలదీసింది.
మహమ్మారి పంజా బారిన పడి అదృష్టవశాత్తు కోలుకున్న కమల్‌హాసన్, తనలాగా ఇతరులెవరూ దాని దగ్గరికి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చైతన్య పరచడానికి బదులుగా, అందుకు విరుద్ధంగా షూటింగ్లో పాల్గొనడం ఏంటనే నిలదీతలు వస్తున్నాయి. కరోనా నిబంధనలు ఉల్లంఘించి షూటింగ్ చేయడం సరైంది కాదని తమిళనాడు ప్రభుత్వం అంటోంది.
కమల్ చర్యలతో ఇతరులు ప్రమాదం బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారా ? అంటూ ప్రశ్నించింది. ఈ చర్యపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం.