ఈ దేశంలో రాజ్యాంగం ప్రజలకు అద్భుతమైన హక్కులను ప్రసాదించింది. ప్రజల జీవితాలు ఎలా సాగాలో నిర్దేశించే విధివిధానాలను కూడా రూపొందించింది. అయితే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఉన్నాయి కదా అని విర్రవీగుతూ, విచ్చలవిడిగా తప్పుడు పనులకు పాల్పడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఎందుకు ఊరుకోవాలి? అలాంటి విచ్చలవిడితనానికి ఏదో ఒక దశలో అడ్డుకట్ట వేయకపోతే సమాజం పూర్తిగా దారి తప్పిపోకుండా ఉంటుందా? అనేవి నిత్యం మనకు ఎదురవుతూ ఉండే ప్రశ్నలు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద నెత్తురు చల్లుతూ తెలుగుదేశం పార్టీ ప్రచురించిన పుస్తకం చర్చనీయాంశం అవుతోంది.
తమకు వాక్ స్వాతంత్రం ఉన్నది కదా అనే ఉద్దేశంతో.. అబద్ధాలను ప్రచారంలో పెడుతూ తమకు తెలియని సంగతులను కూడా వండి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రజల మెదడులలో విషం నింపడానికి సాగే ప్రయత్నాలను కూడా అరికట్టకుండా వదిలేస్తే ప్రభుత్వాలు తప్పు చేసినట్లే అవుతుంది కదా. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచురించిన 'జగనాసుర రక్త చరిత్ర'అనే పుస్తకాన్ని తక్షణం నిషేధించి, ఆ పుస్తకం ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ప్రజలు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ విషయంలో ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. వైయస్ జగన్ సన్నిహితులకు ఈ హత్యతో ముడి పెట్టడానికి పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లు శత విధాలుగా ప్రయత్నిస్తూ వచ్చాయి. ఇప్పుడు తెలుగుదేశం మరో అడుగు ముందుకు వేసి ఏకంగా జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా మార్చేస్తూ ఒక పుస్తకమే ప్రచురించేసింది. సిబిఐ కోర్టు విచారణలు జరుగుతూ ఉండగానే ముఖ్యమంత్రి జగన్ ను నిందితుడిగా అభివృద్ధి ప్రజల్లోకి విస్తృతంగా ఈ ప్రచారాన్ని తీసుకెళ్లడం ఏరకంగా నైతిక రాజకీయం అనిపించుకుంటుంది.
మరో అంశం మనం గమనిస్తే.. గుజరాత్‌లో గోద్రా అల్లర్లు తదితర మతపరమైన మారణకాండ కు సంబంధించి, ఇటీవల బీబీసీ ఒక వీడియోను రూపొందించింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారకుడు అన్నట్లుగా ఈ వీడియో రూపొందింది. అయితే కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ఈ వీడియోను నిషేధించింది. ఆ వీడియో ఉన్న అన్ని ప్లాట్ఫారం ల మీద నుంచి దానిని తొలగింప చేసింది. ప్రధాని మీద అనుచితమైన ఆరోపణలతో, నిరాధారమైన నిందలతో నిందలు వేయదలచుకుంటే వాటిని అడ్డుకుంటాం అని కేంద్రం సంకేతాలు ఇచ్చింది.
అదే తరహా నిర్ణయం ఇప్పుడు జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తకం మీద నిషేధం విధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. బాబాయి హత్య వ్యవహారంలో జగన్ పాత్ర ఉన్నదని విచారణలలో తేలితే.. ఆ తర్వాత ఇలాంటి ప్రచారం చేసుకుంటే సబబుగానే ఉండేది. కానీ ఎలాంటి ఆధారము తమ చెంత లేకుండా, రాజకీయ వక్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డిని గా ప్రొజెక్టు చేయడానికి కుట్రపూరితంగా ప్రచురించిన పుస్తకాన్ని ప్రభుత్వం కచ్చితంగా నిషేధించాలి. దాని రూపకర్తలపై కూడా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి.
ఇవాళ తెలుగుదేశం పార్టీ, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు.. నిరాహార ఆరోపణలతో వ్యక్తిత్వ హననం చేయడానికి పూనుకుంటే.. అలాంటి కుట్రలను ప్రభుత్వాలు అనుమతించకూడదు. తన మీద వచ్చిన పుస్తకాన్ని నిషేధించడానికి సీఎం జగన్ మొహమాట పడితే గనుక, కేంద్రానికి ఫిర్యాదు చేసి అయినా ఆ పుస్తకాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.