ఆ పార్టీలో నెంబర్-2 ఎవరు?

చదరంగం ఆటలో కీలకమైన పావు “మంత్రి”. రాజుని కాపాడే బాధ్యతతో పాటు శకటలాగ క్రాసుగా, ఏనుగులాగ అడ్డంగా నిలువుగా ఎలాగైనా కదలగల శక్తి దాని సొంతం. ఎన్ని పావులు పోయినా మంత్రి చివరిదాకా ఉంటే…

చదరంగం ఆటలో కీలకమైన పావు “మంత్రి”. రాజుని కాపాడే బాధ్యతతో పాటు శకటలాగ క్రాసుగా, ఏనుగులాగ అడ్డంగా నిలువుగా ఎలాగైనా కదలగల శక్తి దాని సొంతం. ఎన్ని పావులు పోయినా మంత్రి చివరిదాకా ఉంటే ఆట గెలిచే అవకాశాలుంటాయి. 

ఆ ఆటని ప్రస్తుత రాజకీయాలతో పోలిస్తే మోదీ ఆడే చదరంగంలో మంత్రిస్థానంలో ఉన్నది అమిత్ షా. ఆ స్థానాన్నే నెంబర్-2 స్థానమంటాం. చాలా పవర్ఫుల్. ఎన్నో నిర్ణయాలు మోదీని సంప్రదించకుండా కూడా తీసుకోగలిగే శక్తియుక్తులతో పాటూ మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉండడం అమిత్ షా నైజం. అందుకే ఆ పార్టీ ప్రస్తుతం మోదీ-షా పార్టీగా దేశంలో చాలా బలంగా ఉంది. 

అలాగే కేసీయార్ ఆడే ఆటలో కెటీయార్ మంత్రి. తండ్రికి తగ్గ తనయుడు…కొన్ని విషయాల్లో మించిన తనయుడు. యంత్రాంగం మొత్తం తన కనుసన్నల్లో నడుస్తుంటుంది. పాలన కేసీయార్ చేస్తే, పార్టీలో ఏర్పడే ఇబ్బందుల్ని సరిచేసుకుంటూ సమర్ధవంతంగా నడిపిస్తున్న నాయకుడు కేటీయార్. 

పార్టీలకి నిజమైన గ్లామర్ నెంబర్-1 తో పాటు నెంబర్-2 ని బట్టి కూడా ఉంటుంది. జనం నమ్మేది కూడా నెంబర్-1 కి నెంబర్ -2 కి మధ్యలో ఉన్న సయోధ్యని చూసే ఉంటుంది. ఇద్దరూ సమర్థులుగా కనపడాలి. అప్పుడే పార్టీ బలంగా కనిపిస్తుంది. 

నెంబర్-1 స్థానంలో ఉన్నవాడి బాధ్యత పరిపాలన. ప్రజలకి అన్నీ సక్రమంగా అందుతున్నాయా, యంత్రాంగం సక్రమంగా పనిచేస్తోందా అనేది చూసుకోవాలి. కానీ ఆ పదవి పదిలంగా ఉండాలంటే పార్టీ బలంగా ఉండాలి. నాయకుల మధ్యలో మనస్పర్థలు రాకుండా, కార్యకర్తల ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చూసుకోవాలి. ఈ పని నెంబర్-2 చెయ్యాలి. 

పైన చెప్పుకున్న ఉదాహరణల్లో కెసీయార్-కెటీయార్ లది కుటుంబపాలన కాబట్టి సాగుతోంది అనుకోవచ్చు. కానీ మోదీ-అమిత్ షా లు బంధువులేం కాదు. అయినా ఇద్దరి బంధం చెస్ ఆటలో రాజు, మంత్రిలాగే కొనసాగుతోంది. 

ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ కి ఉదయనిధి స్టాలిన్ నెంబర్-2 గా సరైన పనిచేస్తున్నాడు. పార్టీ ఇమేజ్ ని పెంచుతున్నాడు. గ్రౌండ్ రిపోర్ట్స్ సక్రమంగా అందిస్తున్నాడు. స్టాలిన్ కూడా విషయమెరిగి లౌక్యంప్రదర్శిస్తూ ఇతర నాయకుల పట్ల డివైడ్ అండ్ రూల్ పద్ధతిని అవలంబిస్తూ సమర్ధవంతంగా పాలిస్తున్నాడు.  

ఇప్పుడు తెదేపా విషయానికొద్దాం. చంద్రబాబు పార్టీలో నెంబర్-1. ఆయన దృష్టిలో లోకేష్ నెంబర్-2. కానీ కొడుకు శక్తేమిటో అస్సలు తెలియని పిచ్చిమారాజు చంద్రబాబు. పాదయాత్రలో భాగంగా కుప్పం పర్యటిస్తున్నప్పుడు ఒక కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, వస్తున్న పాజిటివ్ సర్వేలు ఫేక్ అని చెప్పి దానిపై దృష్టి సారించమని కోరాడు. వెంటనే లోకేష్ మైక్ అడిగి తీసుకుని “మనమే అలా అనుకుంటే ఎలాగయ్య? సర్వేలు ఫేక్ అని నువ్వెలా చెప్పగలవ్” అంటూ మందలించాడు తప్ప..ఆ విషయాన్ని తప్పకుండా నెంబర్-1 దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని చెప్పలేదు. 

దీనివల్ల మిగిలిన కార్యకర్తలు కూడా ఏ విధయమైన విమర్శ చెప్పరు. అంతా బాగుందని డప్పుకొడతారు, లేదా మౌనంగా ఉంటారు. కనుక నెంబర్-2 స్థానంలో ఉన్న లోకేష్ పార్టీలోని సభ్యుల ఆమోదాన్ని పొందడంలో పూర్తిగా ఫెయిలౌతున్నాడు. 

మరి జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏవిటి? ఆయన పార్టీలో నెంబర్-2 ఎవరు? అసలా స్థానం బలంగా ఉందా? ఉంటే జగన్ మోహన్ రెడ్డితో సఖ్యత ఏ స్థాయిలో ఉంది? ఆ స్థానంలో బయటి జనం అనుకునే పేరు ఒకటి కావొచ్చు, వాస్తవ పరిస్థితి వేరే కావొచ్చు. ఏది ఏమైనా అది ముఖ్యమంత్రికే ముఖ్యంగా తెలియాలి. 

జగన్ మోహన్ రెడ్డి తిరుగులేని ప్రజాదరణ ఉన్న నాయకుడు. అందులో సందేహం లేదు. అయితే ఆ ఆదరణ పదిలంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆయన నెంబర్-2 మీద ఆధారపడాలి. ఆ వ్యక్తి సరైన సమాచారాన్ని అందిస్తే పర్వాలేదు. లేకపోతే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. మరి సరైన సమాచారాన్ని అందించకపోయినట్టైతే దానికి కారణమేమయ్యి ఉండొచ్చు? 

ఇక్కడే కొన్ని కీలకమైన అంశాలు చెప్పుకోవాలి. 

జగన్ మోహన్ రెడ్డిపై చాలామంది చేసే ఒక అభియోగం ఏంటంటే ఆయన ట్రాన్స్పరెన్సీని తట్టుకోలేమని. 

అదేంటి ట్రాన్స్పరెన్సీ ఉంటే మంచిదే కదా అని అనుకోవచ్చు. 

అక్కడే ఉంది తిరకాసంతా. 

ముఖ్యమంత్రిపై ఒక కంప్లైంట్ ఇదని ఒక ఆంతరంగికుడు చెప్పిన మాట- “ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పజెప్పాక ఆ వ్యక్తికి రకరకాల ఇబ్బందులొస్తుంటాయి. సహజంగా ఆ ఇబ్బందులకి కారణాలు ఇతర నాయకులో, అధికారులో కావొచ్చు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా ఫలానా వారి తీరు గురించి ఏదైనా చెబితే ఆయన వెంటనే ఆ అధికారిని పిలిచి ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ముందే మందలించడమో, సంజాయిషీ అడగడమో చేస్తారని పెద్ద టాక్. ఇది జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో ట్రాన్స్పరెన్సీ కావొచ్చు. కానీ ఇది ఒకరకంగా లౌక్యం లేకపోవడమే. ఇలా స్కూల్లో మాస్టారులాగ వ్యవహరిస్తే ఎవరు ఎవరి మీదా ఏ కంప్లైంట్లూ ఇవ్వరు. తోటివారితో ఎందుకొచ్చిన గొడవన్నట్టు అంతా సస్యశ్యామలంగా ఉందనే బిల్డప్పిచ్చి కూర్చుంటారు”. 

ప్రస్తుతం నెంబర్-2 వర్గం నుంచి వినిపిస్తున్న విషయం ఇదే. ఇందులో ఎంత నిజముందో ముఖ్యమంత్రిగారే గ్రహించాలి. 

ఇదొక్కటే కాదు మరొక కంప్లైంట్ కూడా చెబుతున్నారు- “ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పజెప్పాక ఆ వ్యక్తిపై మరొకరినో ఇద్దరినో సూపర్వైజింగ్ చెయ్యమని నియమిస్తారట జగన్. ఆయన దృష్టిలో దీనికేం పేరు పెడతారో గానీ అందరికీ అనిపించేది మాత్రం “ఎవరినీ నమ్మని నైజం” అని”. 

దీనికి తోడు నెంబర్-2 స్థానంలో ఉన్న వ్యక్తికి ఎటువంటి పవర్స్ ఉండవట. చెస్సులో కనిపించే మంత్రిలాగ ఎటంటే అటు వెళ్లే రూల్ జగన్ గారి ఆటలో లేదట. ఏదైనా చెప్పి చెయ్యాల్సిందేనట. ఇదే నిజమైతే పేరుకే నెంబర్-2 కానీ నిజానికది కట్టప్పలా సింహాసనానికి కట్టుబానిస ఉద్యోగమనుకోవాలి. 

పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతానికి మాత్రం వైకాపా ప్రభుత్వంలో ఉన్న నెంబర్-2లు డమ్మీలే అన్నట్టుంది. ఏ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా వీళ్ళు వింటున్నట్టు నటిస్తారు తప్ప ఆ విషయాన్ని నెంబర్-1 కి తీసుకెళ్లడం లేదన్నది కిందనుంచి వినిపిస్తున్న మరొక ఫిర్యాదు.   

ఒక్కసారి గతంలోకి వెళ్తే వై.ఎస్.ఆర్- కేవీపీ ద్వయం గుర్తొస్తారు. నెంబర్-2 గా కేవీపీ చాలా ప్రభావం చూపారు. అలా ఇప్పుడు జగన్ కి ఎవరున్నట్టు? 

కనుక నెంబర్-2 గా సరైన వ్యక్తిని నియమించుకోవడం, ఆ వ్యక్తికి ఇవ్వవల్సిన పవర్స్ ఇవ్వడం ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చెయ్యాల్సిన పని. లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందాల్సిన పరిస్థితి రావొచ్చు. 

హరగోపాల్ సూరపనేని