మోడ్రన్ ఎరా లో మనుషులు చూసేది, మాట్లాడుకునేది, అభిమానించేది సక్సెస్ ఫుల్ పీపుల్ గురించే! సక్సెస్ ఫుల్ పీపుల్ ఫొటోలను తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా పెట్టుకునేంత స్థాయిలో ఈ అభిమానాలుంటాయి. వివిధరంగాల్లో విజయవంతం అయిన వ్యక్తులకు అంత క్రేజ్ ఉంటుంది.
మరి సక్సెస్ అనేది ఏ క్రికెట్ లోనో, సినిమాల్లోనో, వ్యాపారంలోనో, మేనేజ్ మెంట్ లోనో అద్బుతమైన సక్సెస్ ను సాధించేసి మోడల్ అయిపోవడమే కాదు, ప్రతి ఒక్కరి లక్ష్యంలోనూ సక్సెస్ కావాలనే కసి ఉంటుంది! మరి ఇలాంటి సక్సెస్ పైకి కనిపించేది, అందరూ ఇష్టపడేది. అయితే ప్రతి సక్సెస్ వెనుకా కొన్ని పరాజయాలు, కొన్ని నిస్పృహలు, నిరుత్సాహాలు, విశ్రమించని ప్రయత్నాలూ ఉంటాయి! విద్యలోనో; ఉద్యోగంలోనో మన దృష్టిలో బాగా విజయవంతం అనుకునే వారి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయి ఉంటాయి. అవేమిటో తరచి చూస్తే..
వైఫల్యాలు తప్పనివి!
వైఫల్యం లేకపోతే మనిషి దాదాపుగా సక్సెస్ దిశగా పయనించడు! ఎదురుదెబ్బలు లేకపోతే చాలా వరకూ మనుషులు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండిపోతారు. ఉన్న చోట ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడే విజయం దిశగా పయనం మొదలవుతుంది. ఈ తరహాలో చాలా మంది విజయం దిశగా పయనిస్తారు. మరికొందరు విజయాన్నే లక్ష్యంగా చేసుకుని మొదలుపెట్టి, ఆ ప్రయత్నాల్లో వైఫల్యాలను ఎదుర్కొని ఉంటారు. ఏదేమైనా విజయవంతం అయిన ప్రతి ఒక్కరి ప్రస్థానంలోనూ వైఫల్యాలు తప్పకుండా ఉండి ఉంటాయి. ఏ ప్రయత్నం చేస్తున్నప్పుడు అయినా వైఫల్యాలు ఎదురయినప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదు!
ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదనే విషయాన్ని విస్మరించరాదు. షార్ట్ కట్ లో సక్సెస్ రాదు. కఠోరమైన శ్రమ తప్పనిసరి. శ్రమ లేకుండా సక్సెస్ రాదు. షార్ట్ కట్ లో సక్సెస్ వచ్చిందనుకున్నా.. దానికంత విలువ కూడా ఉండదు. అది తాత్కాలికం కూడా కావొచ్చు!
కంఫర్ట్ జోన్ చాలా ప్రమాదకరం!
ఏదో నెలకింత జీతం వస్తోంది, ఏదో అలా నడుస్తోంది, ఏదో అలా సాగుతోంది, మరీ కష్టపడిపోనక్కర్లేదు.. ఇదే మనిషికి చాలా ప్రమాదకరమైన జోన్. ఎప్పుడైతే కొన్ని కంఫర్ట్స్ దొరికే పరిస్థితి వస్తుందో అప్పటి నుంచి ఎదుగుదల ఆగిపోతుంది. చిన్న వయసులోనే చిన్న చిన్న వాటితో సంతృప్తిపడిపోవడం, ఆస్కారం ఉన్నా ఎదుగుదల గురించి ఆలోచించకపోవడం.. ఇదంతా కంఫర్ట్ జోన్ కిందే వస్తుంది. తాము కంఫర్ట్ జోన్ కు పరిమితం అవుతున్నామనే విషయాన్ని కొందరు తెలుసుకోలేరు. చాలా లేటుగా ఇది అర్థం అవుతుంది. గడిచిపోయిన కాలం వెక్కిరిస్తుంది. అయితే కంఫర్ట్ జోన్ లో ఉంటున్నామని తెలిసీ కొన్ని సార్లు నిర్లక్ష్యపూరితంగా కాలం గడిపేసే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో అవలోకనం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
స్వీయ క్రమశిక్షణ కీలకం!
ఏదైనా అనుకున్నది సాధించాలంటే అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, కాలం కలిసి రావాలి.. అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. టైమ్ గురించి తాత్విక మాటలు చెబుతూ ఉంటారు. అయితే అనుకున్నది సాధించడానికి ప్రిపరేషన్ లేకుండా, ఆ ప్రిపరేషన్ కు తగ్గట్టుగా స్వీయ క్రమశిక్షణ లేకుండా ఏ కాలం కూడా కలిసి రాదు! స్వీయ క్రమశిక్షణ ఉండి, అనుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా కష్టపడితే.. కాలం దానంతట అదే కలిసి వస్తుంది. సక్సెస్ ను సాధించిన ఎవ్వరిని అడిగినా.. తాము పాటించిన క్రమశిక్షణ గురించి వివరిస్తారు. ఇదే అత్యంత కీలకం.
సపోర్ట్ ఉండదు!
చాలా మందికి కష్టపడే తత్వం ఉన్నా, సాధించాలనే లక్ష్యం ఉన్నా.. బ్యాక్ సపోర్ట్ లేక అనుకున్న ప్రయాణాన్ని చేయలేరు. డిగ్రీ పూర్తికాగానే ఏదో ఒక పని చేసుకుని కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిస్థితుల్లో కొందరు పై చదువులకో, పోటీ పరీక్షలను రాయడానికో అవకాశం రాకపోవచ్చు! ఈ తరహా పరిస్థితుల్లోనూ కొందరు పని చేస్తూ, చదువుకుంటూ తమ జీవితాన్ని పూలబాటగా మార్చుకుంటూ ఉంటారు. మరి కొందరు పరిస్థితుల నుంచి సపోర్ట్ లేదనే తత్వంతో కుంగిపోతూ ఉంటారు. అయితే అదనంగా కష్టపడకపోతే మాత్రం పరిస్థితులను నిందిస్తూ ఆగిపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫ్ పిటీ లేకుండా అదనపు శ్రమను వెచ్చిస్తే మాత్రం అదే మీకు అసలైన సపోర్ట్ అవుతుంది.
నిర్ణయాలు తీసుకోగలగాలి!
కఠినమైన పరిస్థితులు ఎదురయినప్పుడు, కష్ట పడుతూ కూడా కొన్ని సార్లు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే మాత్రం విజయం దిశగా గమనం ప్రభావితం అవుతుంది. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఫుల్ టైమ్ కోర్స్ చేస్తుంటే.. చేస్తున్న కోర్సు కచ్చితంగా ఉపయుక్తం అయినది అయి ఉండాలి. ఈ లౌక్యం ఉండాలి. లేదంటే రెండు పడవల ప్రయాణం చేసి కూడా పెద్ద ప్రయోజనం దక్కదు. ఇప్పుడు చేసే పనని ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేలా ఉండాలి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.