నాలుగేళ్ల క్రితం గద్దలకొండ గణేష్ విడుదల అయిన తరువాత నుంచీ అలా వుండిపోయారు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో మైత్రీ నిర్మించాల్సిన సినిమా పని మీద అలా వుండిపోయారు. త్వరలో అది పట్టాల మీదకు వెళ్తుందనే నమ్మకంతో అలా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెరి రీమేక్ కు తనదైన ట్రీట్ మెంట్ ఇచ్చే పనిలో వున్నారు.
ఇదిలా వుంటే నిర్మాత దిల్ రాజు తో హరీష్ కు వున్న అనుబంధం వేరు. మూడు సినిమాల బంధం వారిది. రామయ్యా వస్తావయ్యా…సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..దువ్వాడ జగన్నాధమ్ సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే చేసారు. ఆ తరువాత వేరే బ్యానర్ కు వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో హరీష్ శంకర్ మశ్లీ దిల్ రాజు బ్యానర్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చేతిలో వున్న పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాల్సి వుంది. దాని తరువాతే ఏదైనా. నిర్మాత దిల్ రాజు ఇటు సినిమాల నిర్మాణం, అటు పంపిణీ రెండింటా తన అప్పర్ హ్యాండ్ నిరూపించుకునే పనిలో వున్నారు. పెద్ద హీరోలు, దర్శకులను తన బ్యానర్ లోకి తెచ్చే పనిలో వున్నారు.
తమిళ హీరో విజయ్ తో మరో సినిమా, తమిళ దర్శకుడు శంకర్ తో ఇంకో సినిమా అని వినిపిస్తోంది. అనిల్ రావిపూడి సినిమా వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటికి హరీష్ పేరు కూడా తోడవుతోంది.