జనసేన గట్టెక్కిస్తుందా….?

జనసేన మీదనే దేశంలో అతి పెద్ద పార్టీ బీజేపీ భారం వేసింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన మద్దతు మాకే అని చెప్పుకుంటోంది. బీజేపీలోని టాప్ టూ బాటం లీడర్లు అంతా అదే…

జనసేన మీదనే దేశంలో అతి పెద్ద పార్టీ బీజేపీ భారం వేసింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన మద్దతు మాకే అని చెప్పుకుంటోంది. బీజేపీలోని టాప్ టూ బాటం లీడర్లు అంతా అదే మాటను పదే పదే చెబుతున్నారు. అయితే జనసేన నుంచి మాత్రం ఇప్పటిదాకా బీజేపీకి మా మద్దతు అంటూ ఒక్క మాట అయితే అధికారికంగా రాలేదు.

జనసేన మా నేస్తం, మా దోస్త్ అంటూ బీజేపీ నాయకులే చెబుతూ వస్తున్నారు. జనంతోనే మా పొత్తు అని అంటున్నదీ వారే. ఇలా ఏపీలో తమ రాజకీయంతో పాటు తమ పొత్తులు అన్నీ కూడా అయోమయం చేసుకుంటున్నారా లేక కమలనాధులు అవతల పార్టీలని గందరగోళంలోకి నెడుతున్నారా అన్నది తెలియదు కానీ ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ సీటు గెలవడం మాత్రం ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది.

మండలి ఏర్పడిన తరువాత, మళ్లీ పునరుద్ధరించిన తరువాత చూస్తే ఇప్పటికి అత్యధిక శాతం ఈ సీట్లో గెలిచిన పార్టీ బీజేపీ మాత్రమే. దాంతో ఈసారి కూడా నెగ్గాలని బీజేపీ భావిస్తోంది. పైగా సిట్టింగ్ సీటు అది. ప్రస్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ నే మళ్ళీ నిలబెట్టారు. దాంతో ఈ సీటు మీద పూర్తిగా శ్రద్ధాసక్తులు పెట్టి కృషి చేస్తున్నారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతు ఉంది. అధికారంలో వాటా ఉంది. కాబట్టి గెలుపు ఈజీ అయింది. ఇపుడు అలా కాదు, తెలుగుదేశం తన మానాన తానుపోటీ చేస్తోంది. అధికార వైసీపీకి సహజంగా ఎడ్జ్ ఉంటుంది. దీంతో బీజేపీ జనసేన పేరు జపిస్తోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్ సైతం జనసేన మద్దతుతో ఎమ్మెల్సీ సీటు గెలుచుకుంటామని స్పష్టం చేశారు.

అంతే కాదు 2024 ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ జనసేన కలసి అధికారంలోకి వస్తాయని అంటున్నారు. వైసీపీ గెలవదు, టీడీపీ నిలవదు, మేమే వస్తునామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలవాలి, దానికి జనసేన మద్దతు ఇవ్వాలీ. ఈ కాంబినేషన్ ఇక్కడ వైసీపీ టీడీపీలను ఓడగొడితే అపుడు ఏపీ ఎన్నికల గురించి ఆలోచించవచ్చు అంటున్నారు ప్రత్యర్ధులు. 

ఇంతకీ జనసేన మద్ధతు  భారాన్ని మోస్తుందా, నెల రోజులకు ఎన్నిక వచ్చింది జనసేన అఫీషియల్ గా ప్రకటన చేస్తే బీజేపీ ఫైటింగ్ ఇస్తుందని ధీమా పడవచ్చేమో.