జిఎస్టీ కింద రాష్ట్రానికి రావలసిన 1605 కోట్ల రూపాయల బకాయిలు నెలల తరబడి చెల్లింపులు జరగకుండా పెండింగ్‌లో ఉన్నందున వీటిని వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ రాష్ట్రం ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో జీఎస్టీ బకాయిల విడుదలలో మరింత జాప్యం జరిగే పక్షంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అన్నారు.
జీఎస్టీ చట్టం నిబంధనల ప్రకారం 2015-16 నుంచి ప్రతి ఏటా జీఎస్టీ కింద రాష్ట్రాలకు చెల్లించే వాటాలో 14 శాతం పెరుగుదల ఉండాలి. జీఎస్టీ కారణంగా ఏదైనా రాష్ట్ర ఆదాయంలో నష్టం వాటిల్లితే జీఎస్టీ అమలు ప్రారంభమైన మొదటి అయిదేళ్ళలో ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని కూడా చట్టం స్పష్టం చేస్తోంది.
ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి విలాస వస్తువులపై 28 శాతం లెవీ విధిస్తున్నారు. గత ఏడాది జీఎస్టీ కింద వసూలైన మొత్తం 95 వేల కోట్ల రూపాయలని ఆయన అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి జీఎస్టీ వసూళ్ళు 55 వేల కోట్ల రూపాయలుగా నమోదైంది. అంటే గత ఏడాది ఇదే కాలానికి వసూలు అయిన మొత్తం కంటే ఇది 1.5 శాతం అధికమని చెప్పారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ ఆదాయంలో నష్టాన్ని ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ఈ నష్టం 1605 కోట్లని. ఈ నష్టాలను రెండు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం విధిగా భర్తీ చేస్తూ ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. కానీ అక్టోబర్‌లో చెల్లించాల్సిన ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదు.
డిసెంబర్ 10 నాటికి చెల్లించాల్సిన అక్టోబర్, నవంబర్ మాసాలకు చెందిన బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదని వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 18న సమావేశం కానున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన 1605 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయవలసిందిగా జీఎస్టీ కౌన్సిల్‌కు, ఆర్థిక మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ నష్టాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే గడువును 2022 వరకు పొడిగించవలసిందిగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.