ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఇంచుమించు పదేళ్లు కావాల్సి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆ విభజన గాయాన్ని ఇప్పుడు మళ్లీ కొత్తగా కెలకడానికి ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ ఏపీ విభజన సరిగ్గా జరగలేదని వ్యాఖ్యానించడం చర్చకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన యుపిఏ హయాంలో జరిగినప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సంబరాలు చేసుకోలేదని మోడీ అనడం గమనార్హం. విభజన ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా జరగాలని, వాజపేయి హయాంలో ఆ రకంగా మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని మోడీ చరిత్ర పుటల్లోకి వెళ్లారు. అయితే ఏపీ విభజన గురించి ఇప్పుడెందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అనేదే అర్థం కావడం లేదు.
మోడీ అన్నట్లుగా విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాలలోనూ సంబరాలు జరగలేదని అనడం అబద్ధం. తెలంగాణలో చక్కగా పండుగ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా కుమిలిపోయింది. పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు చెబుతూ.. ఆ భవనం సాక్షిగా చరిత్రలో తీసుకున్న కీలక ఘట్టాలను నెమరు వేసుకుంటూ ఏపీ విభజన గాయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గెలికినట్లుగా మనకు కనిపిస్తుంది.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి ఈ దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక సభలను తీసుకువెళుతున్నారు.
పాత పార్లమెంటు భవనం సాక్షిగా దొర్లిన తప్పులను సరి చేయడానికి కొత్త పార్లమెంటు భవనంలో అవకాశం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవ్యంగా జరగలేదని ఆయన నమ్ముతున్నారు గనుక.. ఆ విభజన గాయానికి విలపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడం తన చేతిలోనే ఉన్నదని ఆయన తెలుసుకోవాలి.
అవశేషా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని పదేపదే ప్రకటనలతో ప్రమాణాలు చేసిన నరేంద్ర మోడీ.. అందుకు ఇప్పటికీ అవకాశం ఉన్నదని గుర్తిస్తే మంచిది.. కాంగ్రెస్ పార్టీని నిందించడానికి ప్రతి సందర్భాన్ని అడ్డగోలుగా వాడుకోవాలనుకునే ఆయన.. విభజన సరిగా జరగలేదని అనడంతో ఊరుకోకూడదు. అప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి తనకు ఏం చేతనవుతుందో నిరూపించుకోవాలి.
అంతేతప్ప, పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు ప్రసంగం ముసుగులో ఉబుసుపోని మాటలు చెప్పి కాలయాపన చేయడం అనవసరం అని ప్రజలు భావిస్తున్నారు.