పవన్ బుర్ర నిండా సినిమా బుద్ధులే!

పవన్ కళ్యాణ్ బుర్ర నిండా సినిమా బుద్ధులే ఉన్నాయి. సినిమా విషయంలో నడిచే మాయ వ్యూహాలే రాజకీయాలలో కూడా వర్క్ అవుట్ అవుతాయని ఆయన భ్రమ పడుతున్నారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ దానిని మార్కెటింగ్…

పవన్ కళ్యాణ్ బుర్ర నిండా సినిమా బుద్ధులే ఉన్నాయి. సినిమా విషయంలో నడిచే మాయ వ్యూహాలే రాజకీయాలలో కూడా వర్క్ అవుట్ అవుతాయని ఆయన భ్రమ పడుతున్నారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ దానిని మార్కెటింగ్ చేసుకోవడంలో మేకర్స్ ఎలాంటి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారో మనందరికీ తెలుసు.  

సినిమా విడుదల అయిన రోజు నుంచి సూపర్ హిట్ అంటూ టీవీలో ప్రకటనలు పోటెత్తిస్తుంటారు. సినిమా అద్భుతం అని, నభూతో న భవిష్యతి అని  పబ్లిక్ టాక్ పేరుతో మాయ వీడియోలను సర్కులేషన్ లో పెడుతుంటారు. సినిమాకు రెండో రోజే టికెట్ కొనే దిక్కు లేకపోవచ్చు గాక.. జనం నీరాజనం పడుతున్నారు అని చాటుకుంటూ.. విజయ యాత్రను కూడా ప్రారంభించేస్తారు. ఇదే తరహా తెలివితేటలను రాజకీయాలలో కూడా చూపించవచ్చునుని పవన్ కళ్యాణ్ తలపోస్తున్నట్లుగా ఉంది.

చంద్రబాబు నాయుడుని జైలులో పరామర్శించి వచ్చిన అనంతరం, జైలు బయట నిల్చుని తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పొత్తుల గురించి పవన్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వారి మధ్య పొత్తుల గురించి పార్టీలో ఎవరేమనుకుంటున్నారనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు..  కానీ పవన్ మాత్రం తన  సినిమా రంగ తెలివితేటలను ప్రదర్శిస్తూ.. ‘ తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్..  ప్రజల హృదయాలు గెలుచుకున్నాం’ అని ముందుగానే ఊదరగొడుతున్నారు .

వీరి పొత్తు హిట్ అవుతుందా, ఫట్ మంటుందా  అని ప్రజలు నిగ్గు తేల్చడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ప్రజాభిప్రాయం వ్యక్తం అయ్యేవరకు ఆగే ఉద్దేశం ఈ సినీ జీవికి లేదు. సినిమా విడుదల అయ్యి కాకముందే.. అది సూపర్ హిట్ అంటూ ప్రకటనలు చేసుకోవడం ఆయన అలవాటు. ఇటీవల కాలంలో బాక్సాఫీసు వద్ద చీదేసిన తన చిత్రాలను కూడా పవన్ కళ్యాణ్ మరియు ఆయన కోటరీ సూపర్హిట్లుగా ప్రచారం చేసుకున్న వైనం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. పొత్తుల విషయంలో కూడా ఆయన మాటలను ప్రజలు అలాగే చూస్తున్నారు.

పొత్తులు ప్రధానం అని.. ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది గెలిచిన తర్వాత తేల్చుకుంటామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు గాని, సీట్ల పంపకాల వద్దనే ఈ రెండు పార్టీల స్నేహబంధాన్ని అనేక చికాకులు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఏదో ప్రస్తుతానికి పవన్ ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నా ఆయన పార్టీలో అసంతృప్తులన్నీ తొలగిపోతాయనుకోవడం భ్రమ. అందుకే పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ సినిమా తరహా జిమ్మిక్కులు జనం మీద ప్రయోగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.