టీడీపీ, జనసేనల పాలిట వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కొరకరాని కొయ్య అయ్యారు. పవన్‌కల్యాణ్, లోకేశ్, అచ్చెన్నాయుడు, పట్టాభి, బుద్దా వెంకన్న తదితర నేతలను సోషల్ మీడియా వేదికగా వర్మ ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. ఆ రెండు పార్టీల ప్రధాన ప్రత్యర్థి, ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల కంటే ముందుగా వర్మ ఘాటైన, వ్యంగ్య కౌంటర్లు ఇవ్వడం ఆసక్తికర పరిణామం.
తాజాగా ట్విటర్ వేదికగా పట్టాభిని “ఏయ్ రసగుల్ల” అంటూ బహిరంగ సవాల్ విసిరారు. పట్టాభికి ఆయన పెట్టిన ముద్దుపేరు ఏంటో అందరికీ తెలిసిందే. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడం టీడీపీకి పెద్ద ఇబ్బందేమీ లేకపోవచ్చు. కానీ రామ్‌గోపాల్ వర్మకు సమాధానం చెప్పడం మాత్రం జనసేన, టీడీపీ నేతలకు చేతకాలేదు. దీంతో పదేపదే వర్మ చేతిలో ఆ రెండు పార్టీల నేతలు చావు దెబ్బలు తినాల్సి వస్తోంది.
తాజాగా పట్టాభి మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మీడియాతో మాట్లాడిన వీడియోను వర్మ షేర్ చేస్తూ, పదునైన విమర్శతో కూడిన ట్వీట్ చేశారు.
“ఏయ్ రసగుల్ల ,వివేకా కేసు గురించి నీ మొత్తమ్ బాడీలో యెక్కడైనా గులాబ్జం ఉంటే నీ మైసూర్ పాక్‌ని బయటకి తీసి, ఛానెల్స్ దేంట్లోనైనా ఈ సబ్జెక్ట్ మీద నాతో డిబేట్లో కూర్చో .. నిన్ను హల్వా చెయ్యడానికి నేను వెయిటింగ్ …. ఓపెన్ ఛాలెంజ్”
టీడీపీ అనుకూల చానల్స్‌లో కూచుని పట్టాభి ఏకపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. నిజంగా వివేకా హత్యపై జనానికి ఏమైనా చెప్పాలని చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి వుంటే… వర్మ సవాల్‌ను స్వీకరించాలి. ఏదైనా చానల్లో వర్మతో డిబేట్ చేయాల్సిన అవసరం వుంది. మరి పట్టాభి సిద్ధమా?