ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్‌మీట్.
“ఏపీలో ఐటీ రంగం ఎలా వుంది?” విలేకరులు ప్రశ్నించారు.
“కోడి వల్ల కోడి పుట్టదు. మొదట గుడ్డు పెడుతుంది. దాన్ని కనీసం మూడు వారాలు పొదగాలి. అపుడు పిల్ల బయటికొస్తుంది. దాన్ని జాగ్రత్తగా సాకితే కోడిగా మారుతుంది. మళ్లీ దాన్నుంచి గుడ్డు వచ్చి, కోడిగా ఎదుగుతుంది”
విలేకరులు తల గోక్కుని ఈ “కుక్కుట శాస్త్రం” మాకెందుకు చెబుతున్నారు? ఐటీ రంగానికి, కోడికి ఏమిటి సంబంధం?” అన్నారు.
మంత్రి తాత్వికంగా నవ్వి “ప్రతిదీ ఒకదానితో ఇంకోటి లింకై వుంటుంది. కార్యాకరణ సంబంధం అంటారు. ప్రతి కార్యానికీ ఒక కారణం వుంటుంది” అన్నాడు.
“కార్యం అనే పదానికి తెలుగులో నానార్థాలు ఉన్నాయి సార్” అన్నాడో విలేకరి.
“అందుకే ఇంగ్లీష్ చదవమనేది. నేను ప్రభుత్వానికి కోడిగుడ్డుకు ఉన్న సంబంధం చెబుతున్నా. గుడ్ గవర్నెస్ అర్థం కావాలంటే గుడ్డు థియరీ అర్థం కావాలి. అసలీ ప్రపంచాన్ని మొదట నిద్రలేపేది కోడి పుంజు. చైతన్య దిశగా మేల్కొలిపే సామాజిక ఉద్యమకారుడు కోడి పుంజు”
“అందుకే జనం దాన్ని కోసుకు తినేస్తున్నారు” అన్నాడో విలేకరి.
“మీ విలేకరులతో సమస్య ఏమంటే కోడిగుడ్డుకి ఈకలు పీకుతారు. తినడానికి బిర్యానీ పెడితే బొక్కలు ఎన్ని వున్నాయని వెతుకుతారు. అసలు బిర్యానీలు ఎన్ని రకాలున్నాయో తెలుసా మీకు? చికెన్‌తో ఎన్ని వెరైటీలు చేయొచ్చో తెలుసా మీకు? కోడి గుడ్డుతో లాభాలు తెలుసా? నేను ఎగ్‌లో ఎప్పుడూ పచ్చ సొన తినను. ఎందుకంటే అది తెలుగుదేశం రంగు”
“సార్ , మీకు ట్రాక్ తప్పారు” గుర్తు చేసాడో విలేకరి.
“నేను ట్రాక్‌లో ఎప్పుడు మాత్రం ఉన్నాను. ఇప్పుడు కొత్తగా తప్పడానికి”
“మంత్రిగా మీరేం చేస్తున్నారో అది చెప్పండి?”
“ఉదయం లేవగానే ఆమ్లెట్ తింటా. చెప్పానుగా ఎల్లో టచ్ చేయనని. ఎగ్స్ కూడా బయట ఎక్కడా కొనం. మా పొలంలోనే కోళ్లని పెంచుతాం. కోళ్లలో చాలా రకాలుంటాయి తెలుసా? కాకి, సేతువ, నెమలి, డేగ….”
మంత్రి మాటలకి అడ్డు తగిలి “అవన్నీ పుంజుల పేర్లు సార్, మీ హయాంలో పుంజులు కూడా గుడ్లు పెడతాయా?” అడిగాడో విలేకరి.
“అసలు పుంజు లేకుండా గుడ్డు వస్తుందా? పూర్తిగా వినే ఓపిక లేదా మీకు? పుంజుల్ని గౌరవించిన తర్వాతే పెట్టల జోలికి రావాలి. పెట్టల్లో వనరాజా, గిరిరాజా, కడక్ నాథ్, శ్రీనిధి, రాజశ్రీ…”
“సార్, శ్రీనిధి , రాజశ్రీ సినిమా హీరోయిన్ల పేరు కదా”
“సినిమాలు చూసి కోళ్లకి ఆ పేర్లు పెట్టి వుంటారు లేవయ్యా, చెప్పేది విను. ఈ కోళ్లకి మామూలు సజ్జలు, జొన్నలు పెడితే గుడ్డులో బలం రాదు. ఎగ్ తినడానికి రుచిగా వుండాలి, పొదిగితే పిల్లలు పహిల్వాన్లలా వుండాలి. దీనికి గాను కోడికి జీడిపప్పు, పిస్తా పప్పు, బాదాం పప్పు….”
“ఇన్ని పప్పులు అనే బదులు డ్రైప్రూట్స్ అంటే సరిపోతుందిగా?”
“మంత్రి అంటే ఎవరు? మంత్రాంగం తెలిసిన వాడు. అన్నీ విడమరిచి చెప్పాలి. అందుకే ఇన్ని డిటైల్స్. ఇన్ఫర్మేషన్ మినిస్టర్‌గా వుండి సమాచారం క్లియర్‌గా లేకపోతే ఎట్లా? కోడికి రకరకాల ప్రొటీన్ ఫుడ్ పెడితేనే మంచి గుడ్డు వస్తుంది. ఆ గుడ్డుని కోడి చేస్తేనే గుడ్డుమార్క్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఈ థియరీ ప్రకారం పరిశ్రమల్ని డెవలప్ చేస్తున్నా” అన్నాడు అమర్నాథ్.
“గుడ్డు తినడం, కోడిని పెంచడం, చలికి భయపడడం కాకుండా ఐటీ మంత్రిగా ఏం చేస్తున్నారో చెప్పండి?”
“మీకు మాటలతో చెబితే అర్థం కాదు. ప్రాక్టికల్‌గా చూపిస్తా” అని అనుచరుడికి సైగ చేశాడు. అతను వెళ్లి ఒక బుట్ట తెచ్చి, తెరిచాడు. అందులోంచి ఒక కోడి పెట్ట, అర డజను పిల్లలు బయటికి దూకాయి.
తల్లి కోడి అందరి వైపు అనుమానంగా చూసి, గన్‌మ్యాన్‌ని భయంగా చూసింది. ఎందుకైనా మంచిదని పిల్లలకి రెక్కల్ని అడ్డం పెట్టింది.
“ఈ కోడి మూడు వారాల క్రితం సింగిల్, ఇపుడు అర డజను పిల్లలు. ఈ బ్యాచ్‌ని ఏడాదిలో 10 వేల కోళ్లు చేస్తా. కోడినే ఇంత డెవలప్ చేస్తే, ఐటీ ఒక లెక్కా” అన్నాడు మంత్రి.
విలేకరుల వాలకం చూసి, పొడవడానికి గాల్లోకి లేచింది కోడి. విలేకరులు పారిపోయారు.
“ఏం మాట్లాడినా బండిని కోడి దగ్గరికే ఎందుకు లాక్కెళ్తారు సార్?” అనుచరుడు అడిగాడు.
“యాక్చువల్‌గా మా ఇంటి పేరు గుడ్డువాడ. జనం కన్ఫ్యూజ్‌తో గుడివాడగా పిలుస్తున్నారు” చెప్పాడు మంత్రి.
జీఆర్ మహర్షి