కాపుల‌కు జీవీఎల్ గాలం!

కాపుల‌కు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు గాలం వేస్తున్నారు. ఈయ‌న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ, ఏపీలో ప్ర‌భావ‌శీలురైన కాపుల‌ను ఆక‌ర్షించేందుకు త‌న వంతు కృషిని జీవీఎల్ కొన‌సాగిస్తున్నారు. గ‌త…

కాపుల‌కు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు గాలం వేస్తున్నారు. ఈయ‌న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ, ఏపీలో ప్ర‌భావ‌శీలురైన కాపుల‌ను ఆక‌ర్షించేందుకు త‌న వంతు కృషిని జీవీఎల్ కొన‌సాగిస్తున్నారు. గ‌త కొంత కాలంగా జీవీఎల్ ప‌దేప‌దే కాపుల రిజ‌ర్వేష‌న్‌పై గ‌ట్టిగా మాట్లాడుతున్నారు. విశాఖ‌పై ఆయ‌న క‌న్నేయ‌డం కూడా ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది.

విశాఖ జిల్లాలో కాపులు ఎన్నిక‌ల్లో నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషిస్తారు. విశాఖ లోక్‌స‌భ స్థానం నుంచి జీవీఎల్ పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్‌పై రాజ్య‌స‌భ‌లో జీవీఎల్ ప్ర‌స్తావించార‌ణే కార‌ణంతో, ఆ మ‌ధ్య విశాఖ‌లో ఆయ‌న్ను కాపుల మీటింగ్‌లో స‌న్మానించారు. తాజాగా మ‌రోసారి రాజ్య‌సభ‌లో జీవీఎల్ కాపుల మ‌న‌సు దోచుకునేలా మాట్లాడ్డం గ‌మ‌నార్హం.

విజ‌య‌వాడ లేదా మ‌చిలీప‌ట్నం జిల్లాల్లో ఒక‌దానికి కాపు నాయ‌కుడు దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేయ‌డం విశేషం. వంగ‌వీటి మోహ‌న్‌రంగా గొప్ప నాయ‌కుడ‌ని, అలాంటి వ్య‌క్తి పేరు ఒక జిల్లాకు పెట్ట‌డం స‌ముచిత‌మ‌ని రాజ్య‌స‌భ వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌డం వెనుక జీవీఎల్ రాజ‌కీయ కోణాన్ని గ‌మ‌నించొచ్చు.

జీవీఎల్ ప్ర‌స్తావించిన జిల్లాల్లో ఒక దానికి ఎన్టీఆర్ పేరును జ‌గ‌న్ స‌ర్కార్ పెట్టింది. అయితే ఇత‌ర‌ నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి వంగవీటి మోహన్‌రంగా పేరు పెట్టడానికి ఎందుకు మనస్కరించలేదని దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ వేదిక‌గా ప్ర‌శ్నించ‌డం ద్వారా పాల‌క‌ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశారు. ఇదే సంద‌ర్భంలో బీజేపీ వైపు సానుకూల దృక్ప‌థంతో కాపులంతా ఆలోచించేలా జీవీఎల్ న‌డుచుకున్నారు.