పవన్ కల్యాణ్ ను కదిపిస్తే పొలిటికల్ ప్రకటనలు మాత్రమే వస్తాయి. వైసీపీపై విమర్శలు ధారాళంగా ప్రవహిస్తాయి. కానీ అతడి నోటి నుంచి సినిమా అప్ డేట్స్ మాత్రం రావు. ఇంకా చెప్పాలంటే చేతి నిండా సినిమాలు, నోటి నిండా పాలిటిక్స్ అన్నమాట. అయితే పవన్ ఫ్యాన్స్ కు మాత్రం అతడి పాలిటిక్స్ అక్కర్లేదు, సినిమాలు మాత్రమే కావాలి.
పవన్ నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్ డేట్ వచ్చినా దాన్ని ట్రెండ్ చేయడానికి రెడీగా ఉంటారు పవర్ ఫ్యాన్స్. అయితే ఈసారి మాత్రం సోషల్ మీడియాలో వీళ్ల అతి కాస్త ఎక్కువైంది. దీనికి కారణం పవన్ సినిమా నుంచి భారీ అప్ డేట్ రావడమే.
ఈమధ్య బాలయ్య 'అన్ స్టాపబుల్' లో కనిపించాడు పవన్ కల్యాణ్. అదే కార్యక్రమానికి క్రిష్ కూడా వచ్చాడు. హరిహర వీరమల్లు లో ఓ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. కేవలం ఆ ఎపిసోడ్ నే 40 రోజుల పాటు తీశామని, ది బెస్ట్ అన్నాడు. పనిలోపనిగా పవన్ కల్యాణ్ తొడ కొట్టాడని కూడా చెప్పుకొచ్చాడు.
అతడు చెప్పి చాలా రోజులైంది కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆ 'తొడ కొట్టుడు' దగ్గరే ఆగిపోయారు. తమ హీరో తొడ కొట్టాడని, ఈసారి కచ్చితంగా సినిమా హిట్ అవుతుందంటూ ఏకబిగిన సోషల్ మీడియాలో చర్చాగోష్టులు పెట్టారు. తొలిసారి తొడ కొట్టిన పెద్ద హీరోల సినిమాలన్నీ హిట్ అయ్యాయంటూ (ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పలేం) ఓ వింత సెంటిమెంట్ ను కూడా తెరపైకి తెచ్చారు.
అసలు తొడ కొట్టడానికి, సినిమా హిట్టవ్వడానికి సంబంధం ఏంటి? అలా తొడ కొడితేనే సినిమాలు ఆడుతాయనుకుంటే బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎన్టీఆర్ చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్టవ్వాలి. మరి వాళ్లకు దక్కని సక్సెస్, తొడ కొట్టిన పవన్ కు దక్కుతుందని ఎలా అనుకుంటారు.
తొడ కొట్టితే సినిమాలు ఆడవు, కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది. ఇంత చిన్న లాజిక్ ను కూడా వదిలేసి సోషల్ మీడియాలో అదే పనిగా తొడలు కొట్టే పనులు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పవన్ సినిమాల నుంచి మరో అప్ డేట్ వచ్చేంత వరకు సోషల్ మీడియాలో ఈ 'తొడ కొట్టే' కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేలా ఉంది.