వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతమైన దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమ వారం జగన్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. గృహ సారథుల నియామకం చేపట్టిన నేపథ్యంలో, వారిని ఎలా సైన్యంగా ఉపయోగించుకోవాలనే అంశంపై జగన్ వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వైసీపీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ తనదైన శైలిలో మార్గం చూపారు. మార్చి 18 నుంచి గృహసారథులు, వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లను వెంటబెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రతి గడపకూ వెళ్లాలని సూచించారు.
టీడీపీ హయాంలో ఏం జరిగింది? అలాగే తమ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచి ఏంటనేది కరపత్రాలను ముద్రించి ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలకు వివరించేందుకు సమాయత్తం కావాలని జగన్ ఆదేశించారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ప్రజానీకానికి జరిగిన నష్టం, అలాగే తమ పాలనలో వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సేవలు అందిస్తున్న వైనాన్ని కరపత్రాల్లో పేర్కొంటారు. ఇలా ప్రతిదీ గతంలో బాబు పాలనలోని దుర్మార్గాలు, తమ పాలనలోని ప్రజారంజక విధానాలను నేరుగా ఐదు కోట్ల జనానికి వివరించడం ఓ యజ్ఞంగా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
అధికారాన్ని శాసించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మంత్రులు, కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, వాలంటీర్లు, గృహసారథులు ఎంతో బాధ్యతగా చేయాలని జగన్ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తే… టీడీపీకి ఓటు వేయాలని ఏ ఒక్కరు అనుకోరని జగన్ చెప్పినట్టు తెలిసింది.
రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విడతల వారీగా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 18 నుంచి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. అది ఏ విధంగా వుంటుందనేది ప్రతిపక్షాలకు అంతు చిక్కకుండా వుంది.