కృష్ణ దంతులూరు అంటే పెద్దగా ఎవరూ గుర్తు పట్టలేక పోవచ్చు. కానీ మంగళి కృష్ణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు సుపరిచితుడే. బహుశా మాజీ మంత్రి పరిటాల హత్య కేసులో ఈయన గురించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌తో ఇతనికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా కృష్ణను వైఎస్ రాజశేఖరరెడ్డి వెనకేసుకొచ్చారు.
దంతులూరు కృష్ణ అంటే వైఎస్ కుటుంబ సభ్యుడనేంతగా కడప జిల్లాలో గుర్తింపు పొందారు. వైఎస్ జగన్‌కు కృష్ణ అత్యంత సన్నిహితుడనే మాటలో రెండో అభిప్రాయానికి చోటు లేదు. అలాంటి కృష్ణ సీఎంవో కీలక అధికారి ధనుంజయరెడ్డిపై ఫేస్బుక్లో సంచలన పోస్టులు పెట్టారు. ధనుంజయరెడ్డిపై బండబూతులు రాశారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని కూడా ఆయన విడిచి పెట్టలేదు. వైసీపీలో కృష్ణ పోస్టులు కాక రేపాయి. ఎంతగా అంటే… చివరికి ఆ పోస్టులు తీసెయ్ మహాప్రభూ అని అభ్యర్థించేంతగా. అయితే సీఎంవోపై …అందులోనూ సీఎం జగన్ ఆత్మగా చెప్పుకునే కృష్ణ వ్యతిరేక పోస్టులు పెడితే, ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయా? అది జరగని పని.
వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఆ పోస్టులు ఏ క్షణంలోనైనా తీసి వేస్తారనే అనుమానం వచ్చిన టీడీపీ, జనసేన నేతలు అప్రమత్తయ్యారు. వాటిని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకూ ఆ పోస్టుల్లో ఏముందంటే…
“సీఎంవో అంటే ఏంది? సీఎం సార్ మీద వచ్చేటి అన్నీ ఎంజాయ్ చేస్తున్నారా మీరు? జగన్ సార్, భారతమ్మ నాకు తల్లిదండ్రి లెక్క. సీఎంవో అంటే పది సెక్టార్లు పది రకాలుగా వుండేవి. ఇప్పుడు ఒకే ఒక్క నాన్ కేడర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి అనే ఒక 420 సీఎంవో ఆఫీస్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నాడట. నిద్ర పోతున్నారా… లం…కొడుకుల్లారా? సీఎం సార్ కుటుంబం మీద ఏమొస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నారో అనేది లేదారా ధనుంజయగా. ఇంటెలిజెన్స్ సీతా సార్ తోపు తురుం అనుకున్నా. ఏమ్ పడుకున్నారా సార్ మీరు? ధనుంజయరెడ్డి ఎక్కడ పడుకున్నాడు? ఇంటెలిజెన్స్ చీఫ్ మీరు ఎక్కడ పడుకున్నారు? సిగ్గు ఉందా మీ సీఎంవో సిస్టమ్‌కు?”
“సీఎంవో అంటే పది రకాలైన ఆఫీసర్స్ వుంటారు. ఈ సిస్టమ్‌కు ఆ ఐఏఎస్ టీమ్. ఇదేంది ఒక 420 ధనుంజయరెడ్డి ఉండడం ఏంది? ఎమ్మెల్యేలు, ఎంపీలను నోటికొచ్చినట్టు తిడుతూ లీడ్ చేయడం ఏంది? ప్రజాస్వామ్యంలో సీఎంవోని ఒక నాన్ కేడర్ దమ్మీ లీడ్ చేయడం ఏంది? అతనిపై మనం ఆధారపడడం ఏంది సార్?”
సీఎంవో అధికారి ధనుంజయరెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌పై దంతులూరు కృష్ణకు విపరీతమైన కోపం రావడానికి కారణం ఏంటో పేర్కొనకపోవడం గమనార్హం. ఎమ్మెల్యేలు, ఎంపీలను ధనుంజయరెడ్డి తిడుతున్నారనే సంగతి కృష్ణ పోస్టుతో బయటపడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్ పరిపాలనలో కనీసం వైసీపీ ప్రజాప్రతినిధులకు కూడా కనీస విలువలేదనే కఠిన వాస్తవాన్ని ఆయన ఆత్మలాంటి దంతులూరు కృష్ణ బయట పెట్టడం అభినందనీయమని అంటున్నారు. ఈ పోస్టులు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుండడంతో, కాసేపటికి వాటిని ఆయన తొలగించడం గమనార్హం. కానీ జగన్‌కు సన్నిహితుడైన కృష్ణ మనసులో ఎంత ఆవేదన ఉన్నదో తెలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.