ఈ బిల్లు కాషాయీకరణలో భాగమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకుని, ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల ఉద్యోగ అవకాశాలకు సమర్థులుగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంగా జగన్మోహనరెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే.. అదేదో రాష్ట్రాన్ని క్రిస్టియానిటీగా మార్చేస్తున్నారన్నంతగా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకుని, ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల ఉద్యోగ అవకాశాలకు సమర్థులుగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంగా జగన్మోహనరెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే.. అదేదో రాష్ట్రాన్ని క్రిస్టియానిటీగా మార్చేస్తున్నారన్నంతగా అందరూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో.. దేశాన్ని కాషాయీకరించేందుకు నరేంద్రమోడీ సర్కారు తెస్తున్న బిల్లులను ఎవరూ కనీసం గమనించడంలేదు. అవును, పౌరసత్వ సవరణ బిల్లు ఖచ్చితంగా దేశాన్ని కాషాయీకరించడంలో భాగమే.

ఈ బిల్లు ఒక రకంగా దేశంలోని ముస్లింల మీద కొత్తగా పౌరసత్వం పొందే అందరిలోనూ ద్వేషభావం రగిలించే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి భారత్ లోకి వలసవచ్చిన శరణార్థులకు వారు మతవిద్వేషానికి గురై.. ఆ దేశాలనుంచి వచ్చి ఉంటే గనుక.. పౌరసత్వం ఇస్తాం అనే ఆలోచనే హేయంగా ఉంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి మత ప్రాతిపదిక రావడమే హేయం. ఆ దేశాలనుంచి వచ్చిన వారు.. ఏ పరిస్థితుల్లో వచ్చారో చెప్పుకుంటే చాలు.. అవి సబబుగా ఉంటే పౌరసత్వం ఇస్తాం అని ప్రకటిస్తే ఇంకా గొప్పగా ఉండేది. సబబుగా లేకపోతే.. తిరిగి ఆ దేశాలకు వెళ్లగొట్టే నిబంధనలూ తేవొచ్చు. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల ఆందోళన కూడా తగ్గుతుంది.

కానీ అలాంటి నిర్ణయాలేవీ లేకపోగా.. ఆ వలస వచ్చిన వారిలో కూడా ముస్లిమేతర మతాలకు చెందిన వారికి మాత్రమే పౌరసత్వం ఇస్తాం అనడం.. చాలా ఘోరం. ఆ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ముస్లింలు కూడా అనేక మంది ఉంటారు. వాళ్లందరి మీద ఇప్పుడు మోడీ సర్కారు ఉగ్రవాదులనే ముద్ర వేసినా.. అంతకు తక్కువ కాకుండా అనుమానంగా చూసినా ఆశ్చర్యం లేదు.

పైగా, మతప్రాతిపదికన ఆ దేశాల్లో వేధించి తరిమేశారు.. అనే భావను సమాజంలోకి తీసుకువెళ్లడమే అసహ్యంగా కనిపిస్తోంది. ఇది ఈ దేశంలోని ముస్లింలను క్షోభకు, ఆవేదనకు గురిచేస్తుంది. ఈ దేశంలో మీకు ఇబ్బందులుంటే.. మీరు కూడా ఆ మూడు దేశాలకు వెళ్లిపొండి అని పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లుగా కూడా ఉంటుంది. కేవలం చట్టసభల్లో బలం ఉండడం అనే కారణాన.. మోడీ సర్కారు తీసుకున్న ఘోరమైన నిర్ణయం ఇది.