వరంగల్‌ పిశాచికి సుప్రీం కోర్టు మరణశిక్ష వేస్తుందా?

  Advertisement అత్యాచారం కేసుల్లో నిందితులకు మన దేశంలో సరైన శిక్షలు పడవని, బాధితులకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరగదని ప్రజలు అనుకునే మాట వాస్తవం. అత్యాచారం చేసినవారిని విచారణే లేకుండా ఎన్‌కౌంటర్‌ పేరుతో…

 

అత్యాచారం కేసుల్లో నిందితులకు మన దేశంలో సరైన శిక్షలు పడవని, బాధితులకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరగదని ప్రజలు అనుకునే మాట వాస్తవం. అత్యాచారం చేసినవారిని విచారణే లేకుండా ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చడమే సరైన శిక్ష అని ఎక్కువమంది భావిస్తున్నారు. అందుకే దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చి చంపినా జనం హర్షించారు తప్ప పోలీసులను, ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు.

 అది బూటకపు ఎన్‌కౌంటరని అందరికీ తెలుసు. అయినప్పటికీ హర్షం వ్యక్తం చేశారంటే న్యాయస్థానాల్లో న్యాయం జరగదనే అభిప్రాయం బలంగా ఉందని అర్థం చేసుకోవాలి.జనంలో ఈ అభిప్రాయం మారాలి. అత్యాచారం కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు పడతాయనే నమ్మకం కలగాలి.  అందుకే వరంగల్‌ జిల్లా పోలీసులు ఈ నమ్మకం కలిగించడానికే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారు. 

వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలంలోని వసంతపూర్‌ గ్రామంలో పోలేపాక ప్రవీణ్‌ అనే యువకుడు ఈ ఏడాది జూన్‌ 19 అర్థరాత్రివేళ తల్లి దగ్గర నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ఎత్తుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్కో కోర్టు రెండు నెలలలోపునే విచారణ పూర్తి చేసి ప్రవీణ్‌ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 

ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే మరణశిక్షను సవాలు చేస్తూ ప్రవీణ్‌ హైర్టును ఆశ్రయించడంతో  సీన్‌ మారిపోయింది. ప్రత్యేక కోర్టు తీర్పును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్పు చేసింది. దోషి తుది శ్వాస విడిచేవరకు ఎలాంటి మినహాయింపు లేకుండా జైల్లోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పుపై జనంలో ఆగ్రహం పెల్లుబికింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను తగ్గించడమేమిటని ప్రజలు ప్రశ్నించారు. అందులోనూ ప్రవీణ్‌ చేసింది తీవ్రమైన నేరం. ఏడాది కూడా నిండని పసిపాపపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడని, అలాంటి వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షే సరైందని ప్రజలు అభిప్రాయపడ్డారు. 

12 ఏళ్ల, అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాల్సిందేనని కేంద్రం చట్టం చేసినా కోర్టులు  ఇలా వ్యవహరించడమేమిటో అర్థం కావడంలేదంటున్నారు. దిశ ఘటన తరువాత ప్రజాగ్రహాన్ని  గమనించిన వరంగల్‌ పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేస్తున్నట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ చెప్పారు. 

రాష్ట్రంలో దారుణంగా అత్యాచారాలు చేసి, హత్యలు కూడా చేసినవారికి సరైన శిక్షలు పడలేదు. అలాంటి కేసుల్లో మరణ శిక్ష విధించాలని జనం ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్ల పైకి వచ్చి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసులపైన, న్యాయస్థానాల మీద ఉంది.