కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలపై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా అందులో పన్నెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నెగ్గిన సంగతి తెలిసిందే. వారిలో దాదాపుగా అందరూ ఫిరాయింపుదారులే.
కూటమి ప్రభుత్వం పడిపోవడంలో కీలక పాత్ర పోషించి, బీజేపీ వైపు చేరిన ఎమ్మెల్యేలకే ఆ పార్టీ ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. రాజకీయంగా ఫిరాయింపుకు పాల్పడినప్పటికీ ప్రజలు వారిని మళ్లీ గెలిపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇప్పుడు బీజేపీ తరఫున ప్రజలు గెలిపించారు. ఈ అంశంపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
ఇది వరకూ కూడా కర్ణాటక రాజకీయ పరిణామాలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో ఉప ఎన్నికల ఫలితాలను ప్రకాష్ రాజ్ నిరసించాడు.
'అభినందనలు కర్ణాటక.. వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మళ్లీ ముందుకు వచ్చారు. వారే మీకు తిరుగుబాణం అవుతారని ఆశిస్తున్నాను. అనర్హులకు మద్దతును ఇచ్చారు.. మంచిది..' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన తప్పు పట్టారు.