cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టిన జగన్

కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టిన జగన్

జగన్‌కు తెలిసి చేశారో తెలియక చేశారో అర్థం కావట్లేదు గానీ.. మొత్తానికి దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరుకున పెట్టారు. ఎన్‌కౌంటర్ పేరిట ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. కానీ.. పోలీసులు నిందితుల కాల్చివేత ఎలా జరిగిందో.. ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇక ప్రభుత్వపరంగా.. అధికారికంగా అందరూ ఆ వాదనకే కట్టుబడి ఉండాలి. కానీ.. సినీనటులు విషయం తెలియక ఏదో ఆవేశంలో మాట్లాడుతారని సర్దుకోవచ్చు.. చట్టసభల ప్రతినిధులతో సహా.. మాజీ కేంద్ర మంత్రులతో సహా.. బాధ్యత గల అందరూ కూడా.. ‘‘భలే జరిగింది’’ అనే టోన్ లో మాట్లాడడం చాలా చిత్రంగా కనిపించింది.

జగన్మోహన రెడ్డి మరీ చిత్రంగా మాట్లాడారు. ఇప్పటిదాకా అందరూ ఎన్ కౌంటర్ కు సంబంధించిన ఘనతను తెలంగాణ పోలీసులకు, సజ్జనార్‌కు ఆపాదించి.. శ్లాఘించే ప్రయత్నం చేస్తోంటే... జగన్ ఏకంగా.. కీర్తి మొత్తం కేసీఆర్ కు కట్టబెట్టడానికి ఉత్సాహపడ్డారు. తాను ముఖ్యమంత్రి గనుక.. తన స్థాయికి తగినట్టుగా ఉండడానికి తెలంగాణ ముఖ్యమంత్రినే ప్రశంసించాలని ఆయన అనుకున్నారేమో తెలియదు. కానీ.. జగన్ మాటల్ని లోతుగా పరిశీలిస్తే.. కేసీఆర్ స్వయంగా పోలీసుల్ని పురమాయించి.. ఎన్‌కౌంటర్ చేయించారని ప్రకటించినట్లుగా ఉంది.

ఇలాంటి ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు.. రాష్ట్రాధినేత అయిన ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందని అనుకోలేం. కానీ... అవన్నీ మీడియా ముందు ప్రకటించే సంగతులు కాదు. సజ్జనార్ అధికారిక ప్రకటనకే అందరూ కట్టుబడి ఉండాలి. అయితే, ఈ ఎన్‌కౌంటర్ మూలపురుషుడిగా అభివర్ణిస్తూ కేసీఆర్‌కు హేట్సాఫ్ చెప్పడం ద్వారా.. జగన్ ఆయనను ఇరుకున పెట్టారేమో అనిపిస్తోంది.

పైగా జగన్మోహన రెడ్డి.. ఏదో యథాలాపంగా మీడియా మీట్ లోనో, టీవీ ఛానెళ్లవారు రెస్పాన్స్ బైట్ అడిగితేనో ఈ మాట చెప్పలేదు. సాక్షాత్తూ చట్టసభలో.. ప్రతిమాట ‘రికార్డు’ల్లోకి వెళ్లే చోట ఈ మాట చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశమే. సాధారణంగా ఎన్‌కౌంటర్ కు కేసీఆర్ ను బాధ్యుడిగా చేస్తూ.. ప్రతిపక్షాలు మానవహక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ.. బాధ్యుడిగా చేస్తూ కీర్తించడం జగన్ చేశారు మరి!

 


×