ఈ మధ్యనే బూతులు తిట్టి, బూతులు తిట్టించుకుని వార్తల్లో నిలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వీబీ రాజేంద్రప్రసాద్. తరచూ టీవీ చర్చా కార్యక్రమాల్లో కనిపించే ఈ తెలుగుదేశం నేత అదే తరహాలో వల్లభనేని వంశీతో గట్టి చర్చాకార్యక్రమం ఒకటి చేపట్టిన సంగతి తెలిసిందే.
ఒక టీవీ చానల్ చర్చాకార్యక్రమంలో వల్లభనేని వంశీ, రాజేంద్రప్రసాద్ లు ఏ రేంజ్ లో తిట్టుకున్నారో అందరికీ తెలిసిందే. బూతులు తిట్టేసుకున్నారు. వీరి తిట్లదండకం వీడియో వెబ్ లో వైరల్ గా నిలిచింది.
మరి చర్చ అనగానే రాజేంద్ర ప్రసాద్ అదే మూడ్ లోకి వెళ్లిపోతున్నట్టుగా ఉన్నారు. శాసనమండలి సభ్యుడు అయిన ఈయన అక్కడే ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ టీడీపీ నేతకు అధికార పార్టీ నేతలు 'ఇది టీవీ చర్చాకార్యక్రమం కాదు..' అని గుర్తు చేశారు.
మండలిలో ఒక అంశం గురించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. *మంత్రులుకు కొమ్ములొచ్చాయి..* అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల అక్కడే ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
'రాజేందప్రసాద్ గారు తను టీవీ చర్చా కార్యక్రమంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు.. సభలో అనుచితమైన భాష ఉపయోగిస్తూ ఉన్నారు.. ఆయన వ్యాఖ్యలను తొలగించండి..' అంటూ సభాపతిని కన్నాబాబు కోరారు. సభలో అతిగా ఆవేశ పడబోయిన రాజేందప్రసాద్ కు టీవీ చానల్ చర్చను గుర్తు చేసి చురకలు అంటించారు అధికార పార్టీ నేతలు.