ఇద్దరు, ముగ్గురు, నలుగురు పెళ్లాలంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేనాని పవన్‌కల్యాణే గుర్తుకొస్తున్నారు. ఒకవైపు పవన్‌పై చంద్రబాబు సానుభూని కనబరుస్తూనే, మరోవైపు చూడుచూడు పవన్‌కు ఎంత మంది భార్యలో అని లోకానికి చెబుతున్నట్టుంది. దీంతో పవన్ పుండుపై బాబు కారం చల్లినట్టవుతోంది.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మహిళల రక్షణపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బహుభార్యత్వం (బైగమీ) కేసుల లెక్కలు చెప్పారు. కొందరు పెద్దపెద్ద నాయకులు ఒకరు, ఇద్దరు, ముగ్గురు సరిపోరని నలుగురు పెళ్లాలు కావాలని కోరుకుంటున్నారన్నారు. దీన్నే బైగమీ అంటారన్నారు. అంతేకాకుండా తనకు ఒక్క భార్యే ఉందని సరదాగా అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రసంగంలోని బహుభార్యత్వం గురించి ప్రస్తావించారు. పవన్‌కల్యాణ్‌పై సీఎం వ్యాఖ్యలు దారుణమన్నారు.
అసలు పవన్‌కల్యాణ్ ఊసే జగన్ ఎత్తలేదు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు సరిపోరు…నలుగురు పెళ్లాలు కావాలని కొందరు నాయకులు కోరుకుంటున్నారని జగన్ అంటే…ఆ మాటల్లో బాబుకు పవన్ ఎందుకు కనిపించారో అర్థం కావడం లేదు.
ముగ్గురు, నలుగురు భార్యలంటే పవన్…పవన్ అంటే ఎక్కువ మంది భార్యలున్న నేతగా బాబు మనసులో ఓ అభిప్రాయం బలంగా నాటుకొందా?
ఐదుకోట్ల ప్రజానీకంలో పవన్ మాత్రమే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా? లేక చంద్రబాబు బహుభార్యత్వాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నారా? బహుభార్యత్వాన్ని కట్టడి చేయాలని సీఎం మాట్లాడక మరెవరు మాట్లాడుతారో చంద్రబాబుకే అర్థం కావాలి?
పవన్‌కల్యాణ్ ప్రజాజీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని పొంతన లేకుండా బాబు కీర్తించడం వెనుక భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జనసేనానిని మచ్చిక చేసుకునే ఉపాయమని అంటున్నారు.