దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్యులు మొదలుకుని, సెలబ్రిటీల వరకు హర్షం వ్యక్తం చేశారు. తమతమ స్థాయిలో వివిధ వేదికల ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో జనసేనాని పవన్‌కల్యాణ్ కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. పవన్ కామెంట్స్…ఇటు వ్యక్తిగతంగా ఆయనకు, పార్టీ పరంగా జనసేనకు బాగా డ్యామేజ్ అవుతున్నాయి.
దీంతో పవన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. నష్ట నివారణ చర్యలను ఆయన చేపట్టాడు. అత్యాచార ఘటనల్లో దోషులకు సింగపూర్ తరహాలో బహిరంగ శిక్షలు అమలు చేయాలని ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశాడు. ఇలాంటి శిక్షలు వేస్తేనే తప్పులు చేయాలనుకునేవారు భయపడతారన్నాడు.
హైదరాబాద్‌లో దిశ సంఘటనకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించారని వాపోయారు. దిశ ఘటనలో దోషులకు సింగపూర్ తరహాలో బహిరంగంగా కేనింగ్ చేయాలని తాను చెప్పానని, దీనికే బెత్తం దెబ్బలు అని వాడానని, అయితే వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
CANING అంటే బెత్తంతో కొట్టడమని డిక్షనరీలో స్పష్టంగా ఉంది. ఒక వైపు కేనింగ్ చేయాలని అన్నానని, దీనికే బెత్తం దెబ్బలు అని వాడానని పవనే చెబుతున్నాడు. మరి వైసీపీ వక్రీకరణ ఎక్కడ? తానే తప్పుగా మాట్లాడానని చెప్పుకోడానికి అహం అడ్డొస్తున్నట్టుంది.
అసలు ఈ మొత్తం వ్యహారంలో తప్పెవరది? ఇంగ్లీష్‌దా? తెలుగుదా? పవన్‌దా? . అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు, పాఠకులే. వారి విజ్ఞతకే వదిలేద్దామా పవన్?