త్రివిక్రమ్ కు కలిసి రాని చిత్ర నిర్మాణం

అందరికీ అన్నీ కలిసి రావు. అందులో ముఖ్యంగా సినిమా నిర్మాణం అన్నది లక్ మీద కూడా ఆధారపడి వుంటుంది. కొందరు మట్టి ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఫ్లూక్ హిట్ లు పలకరించి కాసులు కురిపిస్తాయి.…

అందరికీ అన్నీ కలిసి రావు. అందులో ముఖ్యంగా సినిమా నిర్మాణం అన్నది లక్ మీద కూడా ఆధారపడి వుంటుంది. కొందరు మట్టి ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఫ్లూక్ హిట్ లు పలకరించి కాసులు కురిపిస్తాయి. కొందరు బంగారం లాంటి సినిమా తీసినా మట్టి కొట్టుకుపోతుంది. 

తెలుగులో చాలా మంది మంచి బడా నిర్మాతలు వున్నారు. వారిలో చాలా మందికి సినిమా నిర్మాణం కలిసి రావడం లేదు. వంద కోట్లు పట్టుకు వచ్చి ఇక్కడ ఇచ్చేసి వెళ్లిపోయిన వాళ్లు వున్నారు. ఇంకా ఇక్కడే ఈదుతున్న వాళ్లు వున్నారు. వాళ్లు మంచి వాళ్లే..మంచి సినిమాలే తీసారు. కానీ ఒక్కటీ హిట్ కొట్టలేదు. ఫలానా ప్రొడ్యూసర్ నా…అయితే ఫ్లాప్ గ్యారంటీ అని జోక్ లు వేసుకునే రేంజ్ కు వెళ్లిపోయిన మంచి నిర్మాతలు కూడా వున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ కు ఎందుకో తనకూ ఓ బ్యానర్ పెట్టుకోవాలనిపించింది. అది గమనించినట్లున్నారు…సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు. వేరే బ్యానర్ ఎందుకు..మాతోనే కలిసి వెళ్లండి అన్నారు. దాంతో ఫార్ట్యూన్ ఫోర్ అనే బ్యానర్ ను త్రివిక్రమ్ స్టార్ట్ చేసారు. బహుశా త్రివిక్రమ్..ఆయన భార్య, ఇద్దరు కుమారులు కలిసి, ఈ అదృష్టవంతులైన నలుగురు కావచ్చు. కానీ ఆ అదృష్టం సినిమా నిర్మాణంలో కలిసి రావడం లేదు.

ఇప్పటి వరకు త్రివిక్రమ్ భార్య పేరు యాడ్ చేసి, ఈ కొత్త బ్యానర్ యాడ్ చేసి సితార సంస్థ తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర నీరసమైన పలితాలే నమోదు చేసింది. డిజె టిల్లు ఒక్కటే హిట్. వరుడు కావలెను..స్వాతి ముత్యం, బుట్టబొమ్మ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసినవే. నాన్ థియేటర్ వల్ల లాభం..నష్టం అన్న సంగతి పక్కన వుంచితే త్రివిక్రమ్ లెవెల్ ను నిలబెట్టిన సినిమాలు కావు. 

పైగా త్రివిక్రమ్ లాంటి రచయిత నిర్మాత అన్నపుడు ఈ సినిమాల్లో ఓ రెంజ్ రైటింగ్ స్కిల్స్ వుంటాయని ఆశించడం సహజం. వరుడు కావలెను అయితే త్రివిక్రమ్ ను కాపీ కొట్టి పాస్ కావడానికి చేసిన ప్రయత్నం అని అర్థం అయిపోతుంది. స్వాతిముత్యం కాస్త బెటర్ రైటింగ్ వుంటుంది. బుట్టబొమ్మ అయితే అస్సలు రైటింగ్ అన్నదే కిలో మీటర్ దూరంలో వుంటుంది.

త్రివిక్రమ్ నిర్మాత అన్నపుడు ఆమాత్రం క్వాలిటీ కంట్రోలు వుండాలి కదా? ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సర్ సినిమా వస్తోంది. నిర్మాతగా విడుదలకు ముందు లాభం అందుకుంటే అందుకుని వుండొచ్చు. కానీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంటేనే గొప్ప. ఆ మజా వేరు. సర్ సినిమాతో త్రివిక్రమ్ బ్యానర్ లక్ మీద ఓ క్లారిటీ రావచ్చు.